Reading Time: < 1 minute
Tollywood Choreographer Shrasti Verma Joins Bjp Telangana Instagram Post
 టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ (Shrasti Verma) రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, సిద్ధాంతాలకు ఆకర్షితురాలై ఆమె అధికారికంగా భారతీయ జనతా పార్టీ (BJP) కండువా కప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అధికారికంగా వెల్లడిస్తూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. “బీజేపీ కుటుంబంలో అధికారికంగా చేరడం నాకు ఎంతో ప్రత్యేకమైన మరియు భావోద్వేగ క్షణం. ప్రధాని నరేంద్ర మోదీ గారి విజన్, లీడర్‌షిప్‌ను నేను ఎప్పుడూ ఆదర్శంగా తీసుకుంటాను. పార్టీ మద్దతుదారుగా ఉంటూ, ఇప్పుడు ఈ పెద్ద కుటుంబంలో భాగమవ్వడం ఎంతో గర్వంగా ఉంది.” అని ఆమె రాసుకొచ్చారు.
తనపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన సీనియర్ బీజేపీ నాయకులు రామచంద్రరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పూర్తి నిజాయితీ, అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. “ఇది కేవలం సభ్యత్వం మాత్రమే కాదు.. ఒక కొత్త బాధ్యత. నాకున్న సామర్థ్యంతో సమాజానికి సేవ చేస్తూ, కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగడమే నా లక్ష్యం.” అని అన్నారు.  తన సినీ ప్రయాణంలో ఇప్పటివరకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతూ, రాజకీయాల్లో ప్రారంభించిన ఈ సరికొత్త ప్రయాణంలో కూడా అందరి ఆశీస్సులు, మద్దతు కావాలని ఆమె కోరారు.