
లక్నో: ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నగలు, బంగారం కోసం దుండగులు ఐపీఎస్ అధికారి తల్లిని చంపేశారు. ఆమెను హత్య చేసి నగలతో ఉడాయించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్లో ఉన్న రుధ ధామ్రౌవ అనే గ్రామంలో జరిగింది.
2016 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అశుతోష్ మిశ్రా తల్లి ఇంద్రావతి ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. రోజూలానే పని మనిషి ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో ఇంటికి వెళ్లే సరికి మంచంపై ఇంద్రావతి శవమై కనిపించింది. పనిమనిషి భయంతో ఇంట్లో నుంచి పరుగులు తీసి ఇరుగుపొరుగు వారికి, సదరు ఐపీఎస్ అధికారికి సమాచారం ఇచ్చింది.
ఐపీఎస్ అశుతోష్ మిశ్రా ప్రస్తుతం లక్నోలో విధుల్లో ఉన్నారు. తల్లి హత్య గురించి తెలిసిన వెంటనే బయల్దేరి ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లారు. సాయంత్రం 3 గంటలకు ఇంటికి వెళ్లి చూసేసరికి.. తల్లి మంచంపై విగత జీవిగా పడి ఉంది.
తొలుత గుండెపోటుగా భావించారు. కానీ.. ఆమె గోల్డ్ చైన్, బంగారపు ముక్కు పుడక, చెవి దుద్దులు.. ఒంటిపై ఆమె వేసుకునే ఒక్క బంగారు నగ కూడా కనిపించలేదు. దీంతో.. దొంగలు ఆమెను హత్య చేసి బంగారం కాజేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకి వచ్చారు. అశుతోష్ మిశ్రా ఫిర్యాదుతో పోలీసులు హత్య, దోపిడి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
►ALSO READ | మా వాలంటీర్ తండ్రిని కొట్టి చంపేశారు: కాక్రోచ్ పార్టీ
ఫోరెన్సిక్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. పంచనామా ప్రక్రియను పూర్తి చేశారు. మృతదేహంపై ఎటువంటి గాయాలు లేదా పెనుగులాడినట్లు గుర్తులు కనిపించలేదని ఫోరెన్సిక్ టీం తేల్చింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపగా, ముగ్గురు వైద్యులతో కూడిన ప్యానెల్ వీడియో చిత్రీకరణతో పోస్ట్‌మార్టం నిర్వహించింది.