Reading Time: 2 minutes
Ap Cm Chandrababu On Mega Dsc 2025 Teacher Recruitment In Assembly

CM Chandrababu: మెగా డీఎస్సీ నియామకాల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులకు మంచి విద్యతో పాటు నైపుణ్యాలను అందిస్తే అత్యుత్తమ మానవ వనరులుగా తీర్చిదిద్దవచ్చనే విశ్వాసంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఐటీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా టెక్నాలజీ రంగంలో ప్రపంచస్థాయి మానవ వనరులను తయారు చేశామని పేర్కొన్నారు. విద్యారంగాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించిందని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారని, మహిళలకు ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు మహిళా యూనివర్సిటీని కూడా ఎన్టీఆరే ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.

ఇక, తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో పాఠశాలలు లేని ప్రాంతాలపై తక్షణమే చర్యలు తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రతి కిలోమీటరుకు ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ పాఠశాల, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని వివరించారు. విద్యా ప్రమాణాలను పెంచితేనే సమాజంలో, రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. 2019-24 మధ్య గత పాలకులు ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పుకున్నారని చంద్రబాబు విమర్శించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 14 డీఎస్సీలు నిర్వహించగా, అందులో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 11 డీఎస్సీల ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని తెలిపారు. ఈ నియామకాల్లో ఇప్పటివరకు అవినీతి జరిగిందని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు.

విద్యార్థులను పాఠశాలలకు హాజరయ్యేలా ప్రోత్సహించేందుకు డ్రై రేషన్ కూడా అందించామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకాన్ని తొలిసారిగా టీడీపీ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందని, అనంతరం దానిని ఇంటర్ విద్య వరకు విస్తరించామని తెలిపారు. మహిళలకు విద్యలో 33 శాతం రిజర్వేషన్ కల్పించేలా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇక, DSC-2025 నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కేవలం 148 రోజుల్లోనే DSC-2025 నియామకాలను పూర్తి చేశామని పేర్కొన్నారు. 2019-24 మధ్య ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని మరోసారి స్పష్టం చేశారు.

అసెంబ్లీ వేదికగా వైసీపీకి సవాల్
వైసీపీ నేతలపై కూడా చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. దమ్ముంటే వైసీపీ నేతలు అసెంబ్లీకి వచ్చి తమ ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలను సభలో బయటపెట్టాలని సవాల్ చేశారు. వైసీపీ వద్ద ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేవని అన్నారు. అసెంబ్లీకి రాకుండా రోడ్లపై నిరసనలు చేస్తున్నారని, సభకు వస్తే తమ ఆరోపణలు బయటపడతాయనే భయంతోనే వైసీపీ నేతలు అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. అవకతవకలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయ నియామకాలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. విశ్వసనీయత లేని వ్యక్తి తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యారంగంలో నాణ్యతను పెంచడం, ఉపాధ్యాయ నియామకాలను పారదర్శకంగా చేపట్టడం, విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడం ద్వారా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..