Reading Time: 2 minutes
Trump Iran Nuclear Weapon Hormuz Strait Iran Oman Deal

హార్ముజ్ జలసంధి రవాణా మార్గంపై ఒమన్‌తో ఒక ఒప్పందానికి వచ్చినట్లు టెహ్రాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇరాన్ అణ్వాయుధాన్ని సంపాదించకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదని తేల్చి చెప్పారు.

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కోసం నిర్దేశించిన 60 రోజుల చర్చల గడువు ముగుస్తున్న సమయంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గడువు పొడిగింపుపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. రెండు నెలల క్రితం చర్చలు ప్రారంభమైనప్పటికీ.. ఇరు దేశాల మధ్య కీలక అంశాలపై ఇంకా విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఇంతలోనే ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగాఇరాన్ అణ్వాయుధంపై మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. ‘‘ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ రూపంలోనూ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదనేదే ఎప్పటికీ మా ప్రధాన లక్ష్యం’’ అని పేర్కొన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా చూడటమే అమెరికా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

మరోవైపు హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు సంబంధించిన మార్గాలపై ఒమన్‌తో ఒప్పందానికి వచ్చినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్, ఒమన్ దేశాల మధ్య ఉన్న ఈ కీలక జలమార్గం ద్వారా అంతర్జాతీయ వాణిజ్య నౌకలు రాకపోకలు సాగిస్తుంటాయి. ట్రాన్సిట్ మార్గానికి సంబంధించిన మ్యాప్‌పై ఇరాన్, ఒమన్ మధ్య అవగాహన కుదిరిందని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ సోమవారం తెలిపారు. అయితే తుది ఒప్పందాన్ని ఒక ప్యాకేజీ రూపంలో ఖరారు చేయాల్సి ఉందని చెప్పారు.

రాకపోకలు ఎలా?

ఇరాన్, ఒమన్ మధ్య కుదిరిన అవగాహనకు సంబంధించిన పూర్తి వివరాలను బఘాయీ వెల్లడించలేదు. అయితే గతంలో వెలువడిన వివరాల ప్రకారం.. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిస్తే నౌకలు ఇరాన్‌కు సమీపంలోని మార్గం ద్వారా ప్రవేశించి.. ఒమన్‌కు సమీపంలోని మార్గం ద్వారా బయటకు వెళ్లే విధానం ఉండొచ్చని తెలుస్తోంది. మధ్యంతర కాలంలో ఈ మార్గంలో ప్రయాణించే నౌకల నుంచి ఎలాంటి ఫీజులు లేదా టోల్‌లు వసూలు చేయకూడదనే ప్రతిపాదన కూడా ఉన్నట్లు సమాచారం.

హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంపై అమెరికా కూడా ఒక ఆమోదయోగ్యమైన ఒప్పందాన్ని కోరుతోంది. ఇరాన్ నౌకాశ్రయాలపై కొనసాగుతున్న దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి ముందు హార్ముజ్ మార్గం తెరవడంపై స్పష్టమైన ఒప్పందం కుదరాలని అమెరికా భావిస్తోంది. అయితే ఇరాన్-ఒమన్ మధ్య తాజాగా కుదిరిన అవగాహన అమెరికా అంచనాలకు సరిపోతుందా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇదే సమయంలో ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమంపై ట్రంప్ మరోసారి కఠిన వైఖరి ప్రకటించడం.. అమెరికా-ఇరాన్ చర్చల్లో కీలక అంశాలు ఇంకా పరిష్కారం కాలేదనే సంకేతాలను ఇస్తోంది.