
వరంగల్: ఆర్డర్ చేసిన బిర్యానీ ఆలస్యమైందని నర్సంపేటలో ఒక రెస్టారెంట్‌పై ఆరుగురు వ్యక్తులు దాడి చేశారు. ఆర్డర్ చేసిన బిర్యానీ ఆలస్యంగా అందించడంతో వివాదం తలెత్తింది. రెస్టారెంట్‌లోకి వచ్చిన వారు మద్యం మత్తులో ఫర్నీచర్‌తో పాటు క్యాష్ కౌంటర్ దగ్గర ఉన్న కంప్యూటర్‌ను ధ్వంసం చేశారు. కాటన్ల కొద్దీ అక్కడ ఉన్న వాటర్ బాటిల్స్ను విసిరికొట్టారు. కుర్చీలు, బల్లలు ఎత్తేశారు. దీంతో.. కస్టమర్లు భయభ్రాంతులకు గురయ్యారు.
ఈ ఘటనపై నర్సంపేట పోలీసులకు రెస్టారెంట్ యజమాని యాదగిరి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ను బయటకు విడుదల చేశారు. తాగిన మత్తులో అక్కడ కొందరు చేసిన వీరంగం, నానా రచ్చ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. రెస్టారెంట్లో వాళ్లు కాకుండా మిగిలిన కస్టమర్లు కూడా ఉన్నారనే కనీస స్పృహ లేకుండా ప్రవర్తించారు.
భయానక వాతావరణం సృష్టించారు. మహిళలు బెంబేలెత్తిపోయారు. చిన్నారులతో కలిసి వెళ్లిన ఫ్యామిలీ ఈ హఠాత్ పరిణామంతో భయభ్రాంతులకు లోనయ్యారు. అన్నీ ఇష్టారీతిన విసిరివేయడంతో తమకు, పిల్లలకు ఎక్కడ వచ్చి తగులుతాయోనని భయపడ్డారు. రెస్టారెంట్లో పనిచేసే సిబ్బందిపై కూడా దుండగులు దాడి చేశారు.
ఆ రెస్టారెంట్ యాజమాన్యంలోని ఒక మహిళ వచ్చి నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేసినా ఏమాత్రం వినిపించుకోకుండా దుండగులు మరింత రెచ్చిపోయారు. ఇక.. గొడవ ముదురుతుందనే భయంతో తింటున్న ఫుడ్ను మధ్యలో వదిలేసి అక్కడి నుంచి కస్టమర్లు వెళ్లిపోయారు. కస్టమర్లు ఊహించినట్లు గానే గొడవ మరింత పెద్దదైంది. రెస్టారెంట్ ఫర్నీచర్ మొత్తం ధ్వంసం చేశారు. దాదాపు ఐదే ఐదు నిమిషాల్లో ఆగమాగం చేశారు.