Reading Time: < 1 minute
Devdutt Padikkal Maiden Test Century India Vs Sri Lanka Day 2

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 460/9 వద్ద నిలిచింది. ఈ రోజు వర్షం వల్ల ఆట ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, టీమిండియా బౌండరీలతో భారీ స్కోరు దిశగా సాగింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించిన దేవదత్ పడిక్కల్ రోజు ముగిశాక తన ప్రదర్శనపై స్పందించాడు. టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ మార్కును అందుకోవడం చాలా ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని, గత రెండేళ్లుగా ఈ క్షణం కోసం ఎంతో కష్టపడ్డానని తెలిపాడు. అవకాశం వచ్చినప్పుడు దానిని సరిగ్గా ఉపయోగించుకుని జట్టుకు ఉపయోగపడటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు.

స్పిన్‌ను ఎదుర్కొనేటప్పుడు క్రీజులోకి వెళ్లకముందే స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని పడిక్కల్ వివరించాడు. మైదానంలోకి వెళ్లాక కేవలం బంతిని బట్టి స్పందించడం కాకుండా, ప్రత్యర్థి బౌలర్‌పై ఒత్తిడి పెంచేందుకు మన బలానికి తగ్గట్టుగా కొన్ని షాట్లు సిద్ధంగా ఉంచుకోవడమే తన దిశగా సక్సెస్ మంత్రమని చెప్పాడు. ఫుట్‌వర్క్ నమ్మకం ఉంటేనే ప్రతి షాట్‌ను 100 శాతం కట్టుబడి ఆడగలమని తెలిపాడు. వంద పరుగులు పూర్తి చేసిన తర్వాత రిలాక్స్ అయిపోకుండా, ఆ తరువాతి 20-30 బంతులు చాలా జాగ్రత్తగా ఆడటం ముఖ్యం అని, అదే పెద్ద స్కోర్లు సాధించడంలో కీలకమని అన్నాడు. కర్ణాటక దేశవాళీ క్రికెట్‌లో ఎందరో సీనియర్లు పెద్ద సెంచరీలు చేయడం చూసి తాను కూడా అలాంటి సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడాలని నేర్చుకున్నట్లు పడిక్కల్ పంచుకున్నాడు.

పిచ్ పరిస్థితిపై మాట్లాడుతూ.. రెండో రోజు కూడా వికెట్ పెద్దగా మారిపోలేదన్నారు. అయితే గాలే మైదానంలో సాధారణంగా మూడు, నాలుగో రోజుల్లో పిచ్ వేగంగా మారిపోతుందని, ఇది రాబోయే రోజుల్లో భారత బౌలర్లకు బాగా కలిసివస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అద్భుత ఇన్నింగ్స్ తర్వాత వేడుకలు చేసుకోవా.. అని అడగ్గా, తీవ్ర అలసటగా ఉన్నందున వెంటనే గదికి వెళ్లి విశ్రాంతి తీసుకోవడమే తన ప్రస్తుత ఆలోచన అని నవ్వుతూ ముగించాడు.