
CM Revanth Reddy : వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన అత్యంత కోలాహలంగా సాగింది. మంత్రులతో కలిసి బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్న సీఎం, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించిన పలు కీలక పథకాలు , మౌలిక వసతుల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించారు. పరకాల ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలోకి తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
విద్యా, రవాణా రంగాల్లో నూతన కాంతులు
విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ పరకాలలో రూ.200 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. దీనితో పాటు నియోజకవర్గ యువతకు సాంకేతిక నైపుణ్యాలు అందించేందుకు రూ.45.15 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) నిర్మాణాన్ని ప్రతిపాదించారు. రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే క్రమంలో పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు రూ.65 కోట్ల వ్యయంతో చేపట్టే నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కూడా భూమిపూజ చేశారు.
మౌలిక వసతులు , మున్సిపల్ అభివృద్ధి
పరకాల మున్సిపాలిటీని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు రూ.82 కోట్లతో వివిధ పట్టణాభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. అలాగే పట్టణ ప్రాంత విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ.3 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి, రూ.1.10 కోట్లతో విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ (DE) నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆధ్యాత్మిక రంగానికి ప్రాధాన్యమిస్తూ రూ.5 కోట్లతో శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులను, అక్కంపేట గ్రామంలో రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టే సమగ్ర అభివృద్ధి ప్రణాళిక పనులను , ఆత్మకూర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద టౌన్‌షిప్ నిర్మాణాన్ని ప్రారంభించారు.
ఉపాధి, మహిళా సాధికారతకు ప్రాధాన్యం
గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారత , ఉపాధి అవకాశాలను పెంచే దిశగా దామెర మండలం ల్యాదేళ్ల వద్ద రూ.32.17 కోట్ల అంచనా వ్యయంతో పరకాల ఇందిరా మహిళా డెయిరీ ప్లాంట్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ డెయిరీ ప్లాంట్ ద్వారా స్థానిక మహిళలకు పాడి పరిశ్రమలో మెరుగైన ఆదాయ మార్గాలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రజలకు అందుబాటులోకి వచ్చిన నూతన భవనాలు
పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల అనంతరం పూర్తయిన నూతన భవనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పరకాల ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు రూ.35 కోట్లతో నిర్మించిన అత్యాధునిక 100 పడకల ఏరియా ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చారు. అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు రూ.5 కోట్లతో పూర్తి చేసిన నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని జాతికి అంకితం చేయడంతో పాటు, ఆత్మకూర్ ప్రాంతంలో రూ.1 కోటి వ్యయంతో అందుబాటులోకి తీసుకొచ్చిన అధునాతన ఎస్పీఎం (SPM) సెంటర్‌ను కూడా ప్రారంభించారు.