Reading Time: < 1 minute

ఏపీ నుంచి 29 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఫిన్లాండ్కు పంపిన ప్రభుత్వం

Caption of Image.

విజయవాడ: ఏపీ ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి 29 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఫిన్లాండ్‌కు పంపింది. ఏపీలో విద్యా ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా.. తరగతి గది అభ్యాసాన్ని బలోపేతం చేయడానికి అనువుగా మార్చుకోగలిగే అంతర్జాతీయ పద్ధతులను ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యా పద్ధతులు, వినూత్న బోధనా విధానాలను నేరుగా చూసి.. ప్రత్యక్ష అనుభవాన్ని పొందేందుకు, ప్రభుత్వ పాఠశాలల నుంచి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు పొందిన 29 మంది విద్యార్థులు ఆగస్టు 15న ఫిన్లాండ్‌కు బయల్దేరి వెళ్లారు.

ఈ కార్యక్రమాన్ని ఫిన్లాండ్‌లోని టర్కు విశ్వవిద్యాలయ సహకారంతో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 17 నుంచి 26 వరకు జరిగే ఎనిమిది రోజుల ఆన్‌సైట్ కార్యక్రమంలో భాగంగా.. ఉపాధ్యాయులు టర్కు, రౌమాను సందర్శించి, తరగతి గది పరిశీలనలు, విద్యా క్షేత్ర సందర్శనలు, బాల్య విద్యా కేంద్రాలు, ఉపాధ్యాయ శిక్షణ పాఠశాలలలోని విద్యావేత్తలతో సంభాషణలలో పాల్గొంటారు. ఉపాధ్యాయులు మన సమాజానికి పునాదులని, మన పిల్లల భవిష్యత్తుకు రూపకర్తలని.. మన విద్యార్థులను మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దే శక్తి వారికి ఉందని నారా లోకేష్ చెప్పారు.

ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాల్లో అనుభవం కల్పించి వారిని శక్తివంతం చేయడం మన బాధ్యత అని మంత్రి నారా లోకేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంతర్జాతీయ అభ్యాస అవకాశం మన ఉత్తమ ఉపాధ్యాయులు ఫిన్లాండ్ నుంచి కొత్త ఆలోచనలు, ఉత్తమ పద్ధతులను తిరిగి తీసుకువచ్చి వాటిని మన పాఠశాలలకు అనుగుణంగా మార్చుకోవడానికి సహాయపడుతుందని మంత్రి నారా లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

©️ VIL Media Pvt Ltd.