
Yash Rejected 7 Films: రాకింగ్ స్టార్ యశ్ ప్రస్తుతం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘కేజీఎఫ్’ తర్వాత యశ్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా యశ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీవీ సీరియల్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సమయంలోనే తనకు ఏకంగా ఏడు సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయని యశ్ తెలిపారు. అయితే ప్రతి సినిమా విషయంలోనూ తాను ముందుగా స్క్రిప్ట్ ఇవ్వాలని పట్టుబట్టినట్లు చెప్పారు. టీవీ నటుడు స్క్రిప్ట్ అడగడమేంటని కొందరు ఆశ్చర్యపోయేవారని, కానీ తాను మాత్రం స్టోరీ విషయంలో ఎలాంటి రాజీ పడలేదని వెల్లడించారు.
“నేను ఏ పాత్ర చేసినా దాన్ని ఆస్వాదించాలి. ఆ పాత్ర నాకు నచ్చకపోతే ప్రేక్షకులకు ఎలా నచ్చేలా చూపించగలను? నేను చేసే పనిలో నిజాయితీగా ఉండాలి. ఆ తర్వాత ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అనేది వేరే విషయం. కానీ మనం మాత్రం నమ్మకంతో, ప్రాణం పెట్టి పనిచేయాలి” అని యశ్ పేర్కొన్నారు. స్క్రిప్ట్ విషయంలో తాను పట్టుబట్టడం వల్ల ఆ ఏడు సినిమాలు తన చేతి నుంచి వెళ్లిపోయాయని, అయితే వాటిని కోల్పోయినందుకు ఎప్పుడూ బాధపడలేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే సినిమా పారితోషికం విషయంలోనూ తాను ప్రత్యేకమైన విధానాన్ని పాటిస్తానని యశ్ తెలిపారు. తన మార్కెట్ వ్యాల్యూకు అనుగుణంగానే పారితోషికం ఉంటుందని చెప్పారు. అయితే నిర్మాత నుంచి ముందుగానే భారీ మొత్తాన్ని తీసుకుని, సినిమా రిజల్ట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేనట్లుగా వ్యవహరించడం తనకు ఇష్టం ఉండదన్నారు. ‘కేజీఎఫ్’కు ముందు నుంచే నిర్మాతలతో భాగస్వామ్య పద్ధతిలో పనిచేశానని యశ్ వెల్లడించారు. నిర్మాత ఎంత రిస్క్ తీసుకుంటే తానూ అంతే రిస్క్ తీసుకోవాలనేది తన విధానమని చెప్పారు. సినిమా సక్సెస్ సాధించి లాభాలు వస్తే అందులో తనకు వాటా ఉండాలని, అదే సినిమా నష్టపోతే ఆ నష్టాన్ని కూడా కలిసి భరించాలనేది తన సిద్ధాంతమని వివరించారు.
‘కేజీఎఫ్’ రెండు పార్ట్స్ సక్సెస్‌పై యశ్ మాట్లాడుతూ.. ఈ సినిమా తన ప్రస్తుత చిత్రాలతో పోలిస్తే చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిందని తెలిపారు. అయినప్పటికీ ప్రేక్షకులు సినిమాను అద్భుతంగా ఆదరించారని చెప్పారు. ప్రేక్షకుల నమ్మకమే తనకు అతిపెద్ద బలం అని పేర్కొన్నారు. ఒకప్పుడు తనను విమర్శించినవాళ్లు సైతం తన పని నచ్చితే అభిమానులుగా మారతారని యశ్ అన్నారు. అందుకే తాను ఎప్పుడూ ప్రేక్షకుల కోసమే పనిచేస్తానని తెలిపారు. స్టార్‌గా ఎదిగిన తర్వాత తన లైఫ్ స్టైల్ మారలేదని యశ్ చెప్పారు. గతంలో కంటే ఇప్పుడు మరింత బాధ్యతగా పనిచేస్తున్నానని వెల్లడించారు. ప్రేక్షకులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. ఇక ‘కేజీఎఫ్’లోని తన పవర్‌ఫుల్ డైలాగ్స్‌పై కూడా యశ్ స్పందించారు. సినిమాలో పాత్ర, పరిస్థితులకు అనుగుణంగా చెప్పే డైలాగ్స్‌ను నిజ జీవితానికి అన్వయించుకోవాల్సిన అవసరం లేదన్నారు. నిజ జీవితంలో ఎలాంటి సమస్య ఎదురైనా ప్రతికూలంగా కాకుండా సరైన ఆలోచనతో ఎదుర్కోవాలనేది తన సిద్ధాంతమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.