Reading Time: < 1 minute
Indonesia Earthquake 7 7 Flores Tectonic Plates Ring Of Fire

Earthquake: ఇండోనేషియా వరస భూకంపాలతో వణుకుతోంది. ఆగస్టు 15న ఆ దేశంలో రెండు శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. వీటిలో ఫ్లోరెస్ ద్వీపం సమీపంలో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది. ఈ భూకంపాలకు ప్రధాన కారణం, భూగర్భంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు. ఇండోనేషియా ఆస్ట్రేలియన్ ప్లేట్, సుండా ప్లేట్, పసిఫిక్ ప్లేట్, ఫిలిప్పీన్ సీ ప్లేట్ అనే నాలుగు టెక్టానిక్ ప్లేట్ల కలయిక స్థానంలో ఉంది. దీందో ఈ ప్రాంతంలో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి.

ఆగస్టు 15న ఫ్లోరెస్ సమీపంలో సంభవించిన భూకంపం ప్రధానంగా ఆస్ట్రేలియన్, సుండా ప్లేట్ల సంక్లిష్ట పరస్పర చర్యలతో సంబంధాన్ని కలిగి ఉంది. ఆస్ట్రేలియన్ ప్లేట్ ఉత్తరం దిశగా నిరంతరం కదులుతూ సుండా ప్లేట్ కిందకు జారిపోతుంది. ఈ ప్రక్రియను ‘‘సబ్‌డక్షన్’’ అంటారు. రెండు ప్లేట్లు ఒకదానితో ఒకటి లాక్ అయినప్పుడు వాటి మధ్య భారీ ఒత్తిడి పేరుకుపోతుంది. ఈ ఒత్తిడి దశాబ్ధాలు లేదా శతాబ్ధాలు కొనసాగుతుంది. ఒకానొక సమయంలో భూమిలోని శిలలు ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఒక్కసారిగా విరిగిపోయి భారీ మొత్తంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. ఈ శక్తి భూకంపాలు, సునామీలుగా మనకు కనిపిస్తాయి.

ఫ్లోరెస్ ప్రాంతానికి పెద్ద భూకంపాల చరిత్ర కూడా ఉంది. 1992లో 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపం, దాని తర్వాత సంభవించిన సునామీ భారీ విధ్వంసానికి కారణమై వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు సుండా-బాంకా ఆర్క్ ప్రపంచంలోనే అత్యంత చురుకైన భూకంప ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. ఇండోనేషియా ‘‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’’ పరిధిలో ఉంటుంది. ఈ ప్రాంతం ఇండోనేషియా నుంచి జపాన్ వరకు విస్తరించి ఉంది. ఇక్కడే అధికశాతంలో భూకంపాలు, అగ్ని పర్వత కార్యకలాపాలు జరుగుతుంటాయి.