
వర్షం పడుతోంది… నదులు పొంగుతున్నాయి… నగరాల్లో రోడ్లు, అండర్‌పాస్‌లు నీటితో నిండుతున్నాయి. చూస్తుంటే దేశమంతా వర్షాకాలం కళకళలాడుతున్నట్టే కనిపిస్తోంది. కానీ రైతు పొలంలోకి వెళ్లి చూస్తే మాత్రం మరో కథ కనిపిస్తోంది. భారత్ వ్యవసాయానికి అవసరమైన చోట, అవసరమైన సమయంలో వర్షం కురవడం లేదు.
జూన్ 1 నుంచి ఆగస్టు 14 వరకు దేశంలోని 46శాతం జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అంటే దేశంలో దాదాపు సగం జిల్లాలు వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీగా వర్షాలు కురిశాయి.
ఒడిశాలో సాధారణం కంటే 33 శాతం ఎక్కువ వర్షం పడితే, గుజరాత్‌లో 13 శాతం ఎక్కువగా నమోదైంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో 35శాతం, ఉత్తరప్రదేశ్‌లో 25శాతం, కర్ణాటకలో 21శాతం తక్కువ వర్షపాతాలు రికార్డయ్యాయి. ఇక్కడే అసలు సమస్య దాగి ఉంది. దేశం మొత్తానికి కలిపి వర్షం సాధారణంగా ఉన్నట్టు కనిపించినా… పొలాలు ఉన్న జిల్లాలో వర్షం లేకపోతే ఆ లెక్క ఉపయోగపడదు. ఉదాహరణకు మహారాష్ట్రలో రాష్ట్ర సగటు కేవలం 2శాతం లోటులో ఉంది. కానీ అక్కడ ఏకంగా 39శాతం జిల్లాలు లోటు వర్షపాతంలో ఉన్నాయి.
తెలంగాణలో కూడా 48శాతం జిల్లాలు ఇంకా లోటు వర్షపాతంలోనే ఉన్నాయి. IMD లెక్కల ప్రకారం సాధారణ వర్షపాతం నుంచి 19 శాతం వరకు తేడా ఉంటే దాన్ని సాధారణంగానే పరిగణిస్తారు. 20శాతం లేదా అంతకంటే ఎక్కువ లోటు ఉంటే అది లోటు వర్షపాతం. ఈ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. అక్కడ 88శాతం జిల్లాలు లోటు వర్షపాతంలో ఉన్నాయి. కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లో 60 శాతం జిల్లాలు, తెలంగాణలో 48 శాతం, మహారాష్ట్రలో 39 శాతం జిల్లాలు ఇంకా లోటులోనే ఉన్నాయి. దీని ప్రభావం ఇప్పుడు పొలాల్లో కనిపిస్తోంది.
ఆగస్టు 7 నాటికి దేశంలో 967.92 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. 2025లో ఇదే సమయానికి 985.89 లక్షల హెక్టార్లు సాగయ్యాయి. అంటే సాగు విస్తీర్ణం 1.8శాతం తగ్గింది. ముఖ్యంగా వరి సాగు 4.4శాతం, చిరుధాన్యాలు 2.7శాతం, పప్పుధాన్యాల సాగు 1.8 శాతం తగ్గింది.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఎరువుల అమ్మకాల్లో కనిపిస్తోంది. జూలైలో ఎరువుల అమ్మకాలు ఏకంగా 13శాతం తగ్గాయి. గత ఏడాది జూలైలో 89.41 లక్షల టన్నుల ఎరువులు అమ్ముడైతే, ఈసారి 77.44 లక్షల టన్నులకు పడిపోయాయి. యూరియా అమ్మకాలు 9 శాతం, కాంప్లెక్స్ ఎరువుల అమ్మకాలు 29 శాతం తగ్గాయి. అంటే రైతు పంట వేస్తున్నా… పంటకు పెట్టుబడి పెట్టడంలో కూడా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
వర్షం మీద నమ్మకం లేకపోతే ఎరువులు, ఇతర ఇన్‌పుట్లపై ఖర్చు చేయడానికి రైతు వెనకడుగు వేయడం సహజమే. ఇంతకీ ఇదంతా ఎందుకు జరుగుతోంది? దీనికి ఒక ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో పరిస్థితులు. ఆగస్టు 12న నినో 3.4 ప్రాంతంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 2.66 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంది. ఆ తేదీకి సంబంధించిన 44 ఏళ్ల రికార్డులో ఇదే అత్యధిక స్థాయి. 1982, 2015, 2016 సంవత్సరాల్లో మాత్రమే ఇలాంటి స్థాయిలు నమోదయ్యాయి.
ఎల్‌నినో కారణంగా రుతుపవనాల ప్రసరణ బలహీనపడే అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్‌లో చెప్పింది. ఈ సీజన్‌లో వర్షపాతం 12 శాతం లోటుకు చేరడంలో ఎల్‌నినో ప్రధాన వాతావరణ కారణాల్లో ఒకటిగా పనిచేసిందని స్పష్టం చేసింది. వాస్తవానికి ఐఎండీ ఏప్రిల్‌లో ఈ సీజన్‌కు దీర్ఘకాలిక సగటులో 92 శాతం వర్షపాతం వస్తుందని అంచనా వేసింది. ఆ తర్వాత దాన్ని 90 శాతానికి తగ్గించింది. ఇక ఆగస్టు 12 నాటికి ఇండియా డ్రాట్ మానిటర్ ప్రకారం దేశంలోని 36శాతం గ్రిడ్ అసాధారణంగా పొడిగా లేదా కరువు పరిస్థితుల్లో ఉంది. అందులో దాదాపు పదో వంతు ప్రాంతం తీవ్రమైన కరువు లేదా అంతకంటే దారుణమైన పరిస్థితిలో ఉంది. అందుకే ఈసారి పరిస్థితి విచిత్రంగా మారింది.
ఒకవైపు భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వస్తున్నాయి. మరోవైపు కొద్ది దూరంలోనే పొలాలు ఎండిపోతున్నాయి. ఒక ప్రాంతంలో నేల ఒక్కసారిగా తడుస్తోంది… ఆ తర్వాత చాలా రోజుల పాటు వర్షం కనిపించడం లేదు. నిపుణుల మాటల్లో చెప్పాలంటే వేర్ల స్థాయిలోనే తేమ తీవ్రంగా మారుతూ ఉంది. అయితే కథ ఇంకా ముగియలేదు.
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసే వర్షాలే ఖరీఫ్ పంటల తుది పరిస్థితిని నిర్ణయించనున్నాయి. దేశంలో సగం నికర సాగుభూమి వర్షాధారమే. అందుకే రైతుకు కావాల్సింది కేవలం వర్షం కాదు… సరైన సమయంలో, సరైన ప్రాంతంలో, కొంత విరామంతో కురిసే వర్షం. అసలు ప్రశ్న వర్షాకాలం వచ్చిందా లేదా అన్నది కాదు. వర్షం రైతు పొలానికి చేరిందా? పంటకు అవసరమైన సమయంలో పడిందా? నేలలో తేమ నిలిచేంతకాలం కొనసాగిందా? అన్నదే అసలు ప్రశ్న.