Reading Time: 2 minutes
Buchi Babu Sana Reveals He Wrote His First Story For Ravi Teja

Buchi Babu Sana: వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న దర్శకుడు బుచ్చిబాబు సానా. రవి తేజ నటించిన ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిన్న హైదరాబాద్‌లో జరిగిన ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇటీవల ‘పెద్ది’ చిత్రంతో మరో విజయాన్ని అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన ప్రసంగంలో రవి తేజతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన ఒక విషయం అభిమానులను ఉత్సాహపరిచింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాను రచయితగా మొదట రాసిన కథను రవి తేజ కోసమే రాశానని బుచ్చిబాబు  వెల్లడించారు. ఆ కథను భవిష్యత్తులో తప్పకుండా రవి తేజకు వినిపించాలని అనుకుంటున్నానని కూడా చెప్పారు. ఈ మాటతో సభలో చప్పట్లు మార్మోగగా, రవి తేజ అభిమానులు కూడా ఈ కాంబో నిజమవుతుందా అనే ఆసక్తిని కనబరుస్తున్నారు.

బుచ్చిబాబు సానా ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ఆయన తెరకెక్కించిన ‘పెద్ది’ మంచి స్పందన అందుకోవడంతో పాటు, ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందనే చర్చ ఇప్పటికే జరుగుతోంది. పలువురు అగ్ర హీరోలతో ఆయన పేరు వినిపించినప్పటికీ, ఇప్పటివరకు ఏ కొత్త ప్రాజెక్ట్ ఆఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఇలాంటి సమయంలో రవి తేజ కోసం రాసిన తొలి కథ గురించి ఆయన చెప్పిన మాట మాత్రం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవేళ ఆ కథను ఇప్పుడు తెరకెక్కించే నిర్ణయం తీసుకుంటే, మాస్ మహారాజా ఇమేజ్‌కు తగ్గట్టుగా మరో విభిన్నమైన సినిమా వచ్చే అవకాశం ఉందని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా, రవి తేజ ప్రస్తుతం ఇరుముడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వచ్చిన స్పందనతో పాటు, బుచ్చిబాబు చేసిన ఈ వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ‘ఇరుముడి’ ప్రచారానికి మరో ఆసక్తికరమైన కోణాన్ని తీసుకొచ్చాయి. ఇక నిజంగానే బుచ్చిబాబు, రవి తేజ కలయిక వెండితెరపై సాకారం అవుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

ఇక బుచ్చిబాబు సానా విషయానికి వస్తే.. ‘ఉప్పెన’ తో జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ దర్శకుడు, ఇటీవల రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించిన ‘పెద్ది’ (Peddi) ఘనవిజయంతో మంచి జోష్‌లో ఉన్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ తర్వాత ఆయన గ్యాప్ తీసుకోకుండా తన మూడో సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో స్క్రిప్ట్ పనులను శరవేగంగా జరుపుతున్నారు. ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం, ఆయన మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక పవర్‌ఫుల్ మాస్ ఎమోషనల్ కథను సిద్ధం చేస్తుండగా, మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ హీరో అఖిల్‌లకు సరిపోయే విభిన్నమైన పాన్-ఇండియా కథలను కూడా లైనప్‌లో ఉంచినట్లు చర్చ జరుగుతోంది. అయితే రవితేజ, బుచ్చిబాబు కాంబో ఒక వేల కుదిరినా, పట్టాలెక్కేది మాత్రం ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించట్లేదు.