
హైదరాబాద్: కూకట్ పల్లిలోని ఓ ఇంట్లో గ్యాస్ లీకేజీ అయింది. అయితే.. సిలిండర్ను ఇంట్లో నుంచి సకాలంలో బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే.. ఇంట్లో నుంచి బయటకు తెచ్చే లోపు స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. కూకట్ పల్లి శాంతినగర్లోని ఓ ఇంట్లో గ్యాస్ లీకేజీ కావడంతో గ్యాస్ పైప్, రెగ్యులేటర్ కాలిపోయాయి. స్థానికులు కూకట్ పల్లి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. తక్షణమే స్పందించిన పోలీసులకు ఇంటి యజమాని కృతజ్ఞతలు తెలిపారు.
వంట గ్యాస్ వినియోగించడంలో నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాలపై అవగాహన లోపం, గ్యాస్ లీకేజీలపై ఏమరుపాటు కారణంగా భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తోంది. ప్రధాన ఆయిల్ కంపెనీలు భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేయడం, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు అత్యవసర సేవల నిమిత్తం టెక్నికల్ సిబ్బందిని నియమించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
గ్యాస్ లీకేజీ ఫిర్యాదులతో వినియోగదారుల నుంచి గ్యాస్ ఏజెన్సీలకు కుప్పలు తెప్పలుగా పెండింగ్లో పడిపోతున్నాయి. డెలివరీ బాయ్స్ రిపేరు సిబ్బందిగా అవతారమెత్తి ప్రైవేటు టెక్నీషియన్స్ కంటే అదనంగా సర్వీస్ చార్జీలు వసూలు చేయడం పరిపాటిగా తయారైంది. ఒకవైపు ఆయిల్ కంపెనీల నిర్లక్ష్యం, మరోవైపు వినియోగదారుల తప్పిదాలు వంటింట్లో గ్యాస్ లీకేజీలకు, పేలుళ్లకు కారణమవుతున్నాయి.