Reading Time: 2 minutes
Ananya Raj Dies At 27 Family Reveals News A Month Later

Ananya Raj: హిందీ, తెలుగు సినిమాలలో నటించిన నటి అనన్య రాజ్ (అనన్య సేన్‌ గుప్తా) తన 27 సంవత్సరాల వయసులోనే కన్నుమూశారు. గత ఏడాది కాలంగా తీవ్రమైన శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె 2026 జూలై 15న  ముంబైలో నిద్రలోనే ప్రాణాలు విడిచారు. అయితే ఆమె కుటుంబ సభ్యులు దాదాపు నెల రోజుల తర్వాత, ఆగస్టు 16న ఈ విచారకరమైన వార్తను అధికారికంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 1998 ఆగస్టు 10న జన్మించిన అనన్య.. హిందీలో ‘ఘోస్ట్’ (Ghost), ‘7 అవర్స్ టు గో’, ‘ది ఫైనల్ ఎగ్జిట్’ వంటి చిత్రాలతో పాటు, తెలుగులో డైరెక్టర్ శ్రీనివాసరాజు తెరకెక్కించిన ‘తగ్గేదే లే’ (2022) సినిమాలో కూడా కీలక పాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే చివరి సోషల్ మీడియా పోస్ట్‌లో ఇక నేను వెలిగిపోయే సమయం వచ్చింది అని రాసిన యువ నటి.. కొద్ది రోజులకే ఈ లోకాన్ని విడిచి పెట్టడంతో అభిమానుల హృదయాలను కలిచివేస్తున్నాయి. బాలీవుడ్, తెలుగు చిత్రాల్లో నటించిన నటి, మోడల్ అనన్య రాజ్ మరణ వార్త నెల రోజుల తర్వాత బయటకు రావడంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. 27 ఏళ్ల అనన్య రాజ్ 2026 జూలై 15 తెల్లవారుజామున నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూసినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని వెంటనే బయటపెట్టకుండా, నెల రోజుల పాటు గోప్యంగా ఉంచడం మరింత చర్చకు దారితీసింది. ఇదే సమయంలో ఆమె అంత్యక్రియలను కూడా కుటుంబ సభ్యులు చాలా గోప్యంగా నిర్వహించారు.

కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాల ప్రకారం, గత ఏడాది కాలంగా అనన్య శారీరక, మానసిక సమస్యలతో పోరాడుతున్నారు. ఆమె ధైర్యంగా అన్ని కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ చివరకు నిద్రలోనే తుదిశ్వాస విడిచారని వారు పేర్కొన్నారు. అయితే ఆమె మరణానికి గల ఖచ్చితమైన కారణాన్ని కుటుంబం వెల్లడించలేదు. అనన్య చివరి సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మే 17న షూటింగ్ సెట్‌లో తీసుకున్న ఫొటోను పంచుకుంటూ ఇక నేను వెలిగిపోయే సమయం వచ్చింది అని క్యాప్షన్ రాశారు. అదే ఆమె చివరి పోస్ట్ కావడంతో అభిమానులు ఆ మాటలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో దాదాపు లక్షన్నర మంది ఫాలోవర్లను సంపాదించుకున్న అనన్య మరణ వార్త బయటకు వచ్చిన తర్వాత సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. చిన్న వయసులోనే ఆమె సినీ ప్రయాణం ముగియడం అందరినీ కలిచివేస్తోంది.