Reading Time: < 1 minute

యాదగిరిగుట్టలో పెరిగిన భక్తుల రద్దీ..ఒక్కరోజే రూ.64.77 లక్షల ఆదాయం

Caption of Image.

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వరుస సెలవులు రావడంతో తెలంగాణ, ఏపీ నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తుల రద్దీ కారణంగా స్వామివారి ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్నర సమయం పట్టిందని భక్తులు తెలిపారు. 

ఆలయంలో నిర్వహించిన నిత్య కల్యాణం, సుదర్శన నారసింహ హోమంతో పాటు పలు పూజా కైంకర్యాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సొంత వాహనాల్లో తరలిరావడంతో కొండపైన, కొండ కింద ఉన్న పార్కింగ్ స్థలాలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో కొండపైకి వెళ్లే భక్తుల వాహనాలను తాత్కాలికంగా కిందే నిలిపివేశారు. 

మరో వైపు ఆదివారం ఒక్క రోజే ఆలయానికి భారీ మొత్తంలో ఆదాయం వచ్చింది. సేవా టికెట్లు, ప్రసాదాల విక్రయం, వీఐపీ దర్శనాలు, ఇతర మార్గాల ద్వారా రూ. 64,77,232 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.35,71,950, వీఐపీ దర్శన టికెట్ల ద్వారా రూ.10,79,250, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.7 లక్షలు, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.5,06,400 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.