Reading Time: 2 minutes
రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. షాప్ యజమాని పరార్! కట్‌చేస్తే…

అది 16 నిమిషాల పాటు సాగే ఒక షాపింగ్ సంబరంగా ఉండాల్సింది. కానీ, దానికి బదులుగా, ఆ దుస్తుల దుకాణంలో రూ.16 ఆఫర్ వేలాది మందిని వీధుల్లోకి రప్పించి, తొక్కిసలాట లాంటి పరిస్థితిని సృష్టించింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జ్‌ చేయాల్సి వచ్చింది. ఈ సంఘటన ఆగస్టు 15వ తేదీ రాత్రి కాన్పూర్‌లో జరిగింది.

16 నిమిషాలు.. రూ. 16లకే దుస్తులు:

కాన్పూర్ అలమ్ మార్కెట్‌లో హోసియరీ వ్యాపారం చేసే రయీస్ అలమ్ అనే వ్యాపారి, తన కుమారుడి పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్ మీడియాలో ఒక వినూత్న ప్రకటన ఇచ్చాడు. ఆగస్టు 15 అర్ధరాత్రి 11:59 గంటల నుంచి సరిగ్గా 16 నిమిషాల పాటు తన షాప్‌లోని ఏ జత అయినా షర్టులు, జీన్స్, సూట్లు తదితర రెడీమేడ్ దుస్తులు కేవలం రూ. 16లకే విక్రయిస్తామని పోస్ట్ చేశాడు.

అర్ధరాత్రి వేళ పోటెత్తిన జనం:

ఈ డిస్కౌంట్ వార్త సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అయింది. ఆఫర్ సమయానికంటే ముందే రాత్రి 11:30 గంటలకల్లా సమీప ప్రాంతాల నుంచే కాకుండా కిలోమీటర్ల దూరం నుంచి వేలాది మంది జనం అలమ్ మార్కెట్‌కి చేరుకున్నారు. దాదాపు 3,000 నుండి 4,000 మంది రావడంతో మార్కెట్ వీధులన్నీ జనసందోహంతో కిటకిటలాడాయి. ఒకరినొకరు నెట్టుకుంటూ ముందుకు వెళ్లే క్రమంలో తీవ్ర తోపులాట, తొక్కసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో చాలామంది కిందపడిపోగా, రోడ్డంతా చెప్పులు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో సుమారు పదిమందికి పైగా స్వల్ప గాయాలయ్యాయి.

షాప్ ముసివేసి యజమాని పరార్.. పోలీసుల ఎంట్రీ:

ఒక్కసారిగా విరుచుకుపడిన జనసంద్రం చూసి భయపడిపోయిన షాప్ యజమాని రయీస్ అలమ్, తన దుకాణానికి తాళం వేసి అక్కడికక్కడే అక్కడి నుంచి పారిపోయాడు. పరిస్థితి చేయి దాటడంతో ఏడు పోలీస్ స్టేషన్ల పోలీసులు, ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జనం ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తూ, గుంపును చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు.

చట్టపరమైన చర్యలు:

ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఈ ఆఫర్ ప్రకటించినందుకు పోలీసులు షాప్ యజమాని రయీస్ అలమ్‌పై కేసు నమోదు చేశారని సమాచారం. విచారణ నిమిత్తం అతని సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతి ఉత్సాహంతో ఇచ్చిన ఒక్క ఆఫర్ కాన్పూర్‌లో పెద్ద కలకలమే రేపింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..