
- 23 షిఫ్టుల్లో 17 సార్లు ఆలస్యంగా వచ్చిండని వేటు
- ప్రపంచంలో తొలిసారి ఘటన
శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రతిరోజూ డ్యూటీకి ఆలస్యంగా వస్తున్న ఓ ఎంప్లాయ్‌ని ఏఐ మేనేజర్ ఉద్యోగంలోంచి తీసేసింది. నెల మొత్తంలో ఆయన వచ్చిన 23 రోజుల్లో 17 సార్లు లేటుగా వచ్చాడని, ఆయనను తొలగించడమే సరైనదంటూ స్టోర్ మేనేజ్‌మెంట్‌కు సిఫార్సు చేసింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఆండన్ మార్కెట్‌ను నడిపిస్తున్న లూనా అనే ఏఐ మేనేజర్ ఈ నిర్ణయం తీసుకుంది. ఏఐ సూచనను పరిశీలించిన తర్వాత కంపెనీ అధికారులు ఆ ఉద్యోగిని తొలగించారు. అయితే, ప్రపంచంలో ఒక ఏఐ బాస్ మనిషిని ఉద్యోగం లోంచి తీసేయమని చెప్పడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం.
ఏఐ బాస్ సంగతేందంటే..
ఏఐకి నిజమైన వ్యాపార నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందో పరీక్షించేందుకు అమెరికాకు చెందిన ఆండన్ ల్యాబ్స్ కంపెనీ నిర్వాహకులు శాన్‌ఫ్రాన్సిస్కోలో ‘ఆండన్ మార్కెట్’ను ఏర్పాటు చేశారు. ఆ మార్కెట్ నిర్వహణ బాధ్యతలను అదే కంపెనీ రూపొందించిన లూనా అనే ఏఐ మేనేజర్ చేతిలో పెట్టారు. దీంతో బాధ్యతలు టేకాఫ్ చేసిన లూనా.. పుస్తకాలు, కొవ్వొత్తులు, ఆర్ట్‌వర్క్‌లు, స్పోర్ట్స్, తదితర వస్తువులను విక్రయించే ఆ స్టోర్‌లో స్టాక్ ఎంపిక, ధరల నిర్ణయం, స్టోర్ టైమింగ్స్, ఉద్యోగుల నియామకం వంటి అంశాలను పర్యవేక్షించింది.
రూల్స్ క్రియేట్ చేసింది.. ఆపై మర్చిపోయింది
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఉద్యోగుల హాజరుకు సంబంధించిన నిబంధనలను కొన్ని నెలల కిందట లూనానే రూపొందించింది. ఆ తర్వాత ఆ రూల్‌ను మర్చిపోయింది. ఇది గమనించిన ఆండన్ ల్యాబ్స్ నిర్వాహకులు.. ‘చర్యలు తీసుకోవట్లేదేంటి?’ అని అడిగేసరికి లూనా అలర్ట్ అయింది. ఆ ఎంప్లాయ్‌ని ఉద్యోగం నుంచి తొలగించాలని సిఫార్సు చేసింది. దీనిని విశ్లేషించిన ల్యాబ్స్ సీఈవో లూకాస్ పీటర్సన్.. ఏఐ వ్యవస్థలో లోపాలున్నాయని నిర్ధారించారు. ఏఐ సామర్థ్యాలు ఎంత పెరుగుతున్నా.. ఫిజికల్ యాక్టివిటీస్ కోసం మనుషులపై ఆధారపడాల్సిందేనని స్పష్టం చేశారు.