Reading Time: 3 minutes
Young Heroines Choosing Mother Roles Telugu Cinema

Young Heroines: ఒకప్పుడు హీరోయిన్ అంటే హీరోకు లవ్ ఇంట్రెస్ట్‌గా కనిపించడం, పాటల్లో గ్లామర్ షో చేయడం, యూత్‌ఫుల్ క్యారెక్టర్లు చేయడం మాత్రమే అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ క్రమంగా మారుతోంది. కథలో కీలకమైన పాత్ర, నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్‌ అయితే.. తల్లి పాత్ర చేయడానికి కూడా యంగ్ హీరోయిన్లు వెనకాడటం లేదు. దీంతో హీరోయిన్ కెరీర్‌లో ‘గ్లామర్’ కంటే ‘క్యారెక్టర్ వాల్యూ’ ముఖ్యమవుతోందా? అనే చర్చ మొదలైంది. సాధారణంగా హీరోయిన్ల కెరీర్ స్పాన్ విషయంలో వయసు, లుక్, గ్లామర్ వంటి అంశాలు ప్రభావం చూపుతాయనే అభిప్రాయం ఉంది. హీరోలకు వయసు పెద్ద సమస్య కాకపోయినా.. హీరోయిన్ల విషయంలో మాత్రం కొత్త అవకాశాలు తగ్గిపోతుంటాయని ఇండస్ట్రీలో చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు హీరోయిన్లు తమ ఇమేజ్‌ను పక్కన పెట్టి కథకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటున్నారు. తాజాగా శ్రీనిధి శెట్టి కూడా ఇదే తరహాలో డిఫరెంట్ ఛాయిస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ సినిమాలో ఆమె స్వర్ణ పాత్రలో కనిపించనున్నారు. వెంకటేష్ భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా మధ్యతరగతి కుటుంబానికి చెందిన హోమ్‌మేకర్ పాత్రలో ఆమె నటించనున్నారు. ‘కేజీఎఫ్’, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ వంటి చిత్రాల్లో నటించిన శ్రీనిధి.. కెరీర్ మంచి దశలో ఉన్న సమయంలో ఇలాంటి పాత్రను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ నిర్ణయం వెనుక కేవలం స్క్రిప్ట్ డిమాండ్ మాత్రమే కాకుండా.. పెద్ద హీరోతో సినిమా, ప్రముఖ దర్శకుడి ప్రాజెక్ట్, భారీ బ్యానర్ ద్వారా వచ్చే విజిబిలిటీ, భవిష్యత్ అవకాశాలు వంటి అంశాలు కూడా ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. అయితే ఈ సినిమాలో శ్రీనిధి పాత్ర కేవలం హీరోయిన్‌గా కనిపించడానికి మాత్రమే పరిమితం కాకుండా కథలో కీలకమైన ఫ్యామిలీ ఎమోషన్‌కు ప్రాధాన్యమున్న పాత్రగా ఉంటుందని తెలుస్తోంది.

ఇదే తరహాలో ఐశ్వర్య రాజేష్ కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో భాగ్యలక్ష్మి పాత్రలో నలుగురు పిల్లల తల్లిగా కనిపించారు. వెంకటేష్ సరసన నటించిన ఆమె పాత్ర రెగ్యులర్ హీరోయిన్ ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది. గతంలోనే ‘కాకా ముట్టై’ వంటి చిత్రాల్లో పిల్లల తల్లి పాత్రలో నటించిన అనుభవం ఉండటంతో.. ఈ క్యారెక్టర్‌ను కూడా ఆమె సులభంగా అంగీకరించినట్లు చెప్పొచ్చు. మంచి పాత్ర దొరికితే హీరోయిన్ ఇమేజ్ కంటే నటిగా గుర్తింపు పొందడమే ముఖ్యమని భావించే హీరోయిన్లకు ఐశ్వర్య రాజేష్ ఉదాహరణగా నిలుస్తున్నారు. ఇక రవితేజ – శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’లో ప్రియా భవానీ శంకర్ కూడా హోమ్లీ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. కావేరి అనే పాత్రలో రవితేజ భార్యగా, ఓ పాపకు తల్లిగా ఆమె కనిపించనున్నారు. ప్రస్తుతం యంగ్ హీరోయిన్‌గా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలో ప్రియా ఇలాంటి పాత్రను ఎంచుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పాత్ర కేవలం గ్లామర్ కోసం కాకుండా ఫ్యామిలీ ఎమోషన్‌లో కీలకంగా ఉంటుందని ప్రమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తోంది. ఇదే బాటలో ప్రియాంక మోహన్ కూడా ‘ఓజీ’ సినిమాలో కన్మణి పాత్రలో పవన్ కళ్యాణ్‌కు భార్యగా, ఓ చిన్నారికి తల్లిగా, డాక్టర్‌గా కనిపించారు. రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్ ఇమేజ్‌కు భిన్నంగా ఆమె చేసిన ఈ పాత్ర ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది. స్టార్ హీరోతో సినిమా చేయడం ద్వారా విజిబిలిటీ పెరగడంతో పాటు.. భవిష్యత్‌లో మరిన్ని అవకాశాలు వస్తాయనే లెక్క కూడా ఇలాంటి నిర్ణయాల వెనుక ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు మీనాక్షి చౌదరి ‘లక్కీ భాస్కర్’లో సుమతి పాత్రలో దుల్కర్ సల్మాన్ భార్యగా, ఓ పిల్లాడికి తల్లిగా నటించారు. మిడిల్ క్లాస్ హౌస్‌వైఫ్‌గా కనిపించిన ఆమె పాత్ర గ్లామర్‌కు దూరంగా ఉన్నప్పటికీ కథలో చాలా కీలకంగా నిలిచింది. హీరో తప్పుదారిలో వెళ్తున్నప్పుడు ప్రశ్నించే మోరల్ కంపాస్‌లా సుమతి పాత్ర ఉండటంతో.. మీనాక్షి నటనకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో హీరోయిన్ అంటే కేవలం పాటలు, గ్లామర్ సీన్లకే పరిమితం కాకుండా కథను ప్రభావితం చేసే పాత్ర కూడా కావచ్చని ఈ సినిమా చూపించింది. మాలవిక నాయర్ కూడా ‘బైకర్’ సినిమాలో అనన్యగా హీరో భార్యగా, పదేళ్ల బాబుకు తల్లిగా మూడు టైమ్‌లైన్స్‌లో కనిపించారు. ఆమె గత చిత్రాలను పరిశీలిస్తే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నారు. అందుకే తల్లి పాత్ర చేయడం ఆమెకు ఇమేజ్ షిఫ్ట్ కంటే పెర్ఫార్మెన్స్‌కు మరో అవకాశం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక మృణాల్ ఠాకూర్ కూడా తల్లి పాత్రల విషయంలో ప్రత్యేకమైన బాటలో వెళ్తున్నారు. ‘హాయ్ నాన్న’లో యష్నాగా ఓ పాపకు తల్లిగా కనిపించిన ఆమె.. కథలోని మాతృత్వం, ప్రేమ, మెమరీ లాస్ వంటి భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న పాత్రను పోషించారు. తాజాగా ‘డెకాయిట్: ఏ లవ్ స్టోరీ’లో కూడా ఓ చిన్నారికి తల్లిగా, కూతురి కోసం రిస్క్ తీసుకునే పాత్రలో కనిపించారు. దీంతో మృణాల్‌కు తల్లి పాత్ర అనేది పరిమితి కాకుండా కథను ముందుకు నడిపించే బలమైన ఎమోషన్‌గా మారుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. యంగ్ హీరోయిన్లు తల్లి పాత్రలు ఎంచుకోవడానికి ఒక్క కారణమే లేదని స్పష్టమవుతోంది. కొన్ని సినిమాల్లో కథ డిమాండ్ కావచ్చు.. మరికొన్ని చిత్రాల్లో నటనకు స్కోప్ ఉండొచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో స్టార్ హీరోలతో పనిచేయడం, భారీ ప్రాజెక్టుల్లో భాగం కావడం, భవిష్యత్ అవకాశాలను పెంచుకోవడం వంటి అంశాలు కూడా ఉండొచ్చు. ఏదేమైనా.. ‘హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే’ అనే పాత ఫార్ములాకు ఇప్పుడు కాలం చెల్లుతున్నట్టే కనిపిస్తోంది. నటిగా గుర్తుండిపోయే పాత్రల కోసం యంగ్ హీరోయిన్లు ఇమేజ్ రిస్క్ తీసుకుంటూ కొత్త కెరీర్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు.