
సినిమా అంటే కేవలం థియేటర్లలోనే చూడాలనే రోజులు పూర్తిగా మారిపోయాయి. కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలకు, బోల్డ్ కాన్సెప్ట్ సినిమాలకు ఇప్పుడు ఓటీటీ వేదికలు అద్భుతమైన అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ కోవలోనే తాజాగా ఓ తెలుగు సినిమా ఓటీటీలో సంచలనాలు సృష్టిస్తోంది.తెలుగులో తెరకెక్కిన బోల్డ్ రొమాంటిక్ సైకాలజికల్ థ్రిల్లర్ ఆంథాలజీ మూవీ ‘డార్క్ సీక్రెట్స్’ (Dark Secrets) సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
అద్దె విధానంలోనూ అగ్రస్థానమే!
సాధారణంగా ఓటీటీలో నేరుగా ఉచితంగా లభించే సినిమాలకే ఎక్కువ వ్యూస్ వస్తుంటాయి. కానీ, అమెజాన్ ప్రైమ్‌లో ‘డార్క్ సీక్రెట్స్’ సినిమాను పే-పర్-వ్యూ/రెంటల్ (Pay-per-view/Rental) విధానంలో ఉంచారు. అంటే ఈ సినిమా చూడాలంటే ప్రేక్షకులు అద్దె (రూ.99) చెల్లించి చూడాల్సి ఉంటుంది. అయినప్పటికీ, ఈ అద్దె విధానంలోనూ ‘డార్క్ సీక్రెట్స్’ ఊహించని రీతిలో రికార్డులు బద్దలు కొడుతోంది.
నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్ నంబర్ 1!
దేశవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన వివిధ భాషల భారీ బడ్జెట్ చిత్రాలు, పాపులర్ వెబ్ సిరీస్‌లతో పోటీ పడుతూ ఈ తెలుగు చిన్న సినిమా అద్భుతం చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే “ట్రెండింగ్ టాప్ 10 పర్చాస్ ఇన్ ఇండియా” (Trending Top 10 Purchases in India) జాబితాలో ‘డార్క్ సీక్రెట్స్’ ఏకంగా నెంబర్ 1 స్థానానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.
సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటంటే?
సమాజంలో సామాన్యులు తమ వెనుక దాచుకునే అసాధారణమైన రహస్యాల ఆధారంగా ఈ ఆంథాలజీ తెరకెక్కింది. మానవ సంబంధాలు, కోరికలు, ఒంటరితనం, సామాజిక ఒత్తిళ్లు మరియు హద్దులు దాటే భావోద్వేగాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. సమాజంలో బహిరంగంగా మాట్లాడేందుకు ఇష్టపడని కొన్ని సున్నితమైన, బోల్డ్ అంశాలను స్పృశిస్తూ దర్శకుడు అవినాష్ కొకాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ చిత్రంలో అప్సర రాణి, అరవింద్ రెడ్డి, జయ శ్రీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈస్ట్ వెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి మోహిత్ రెహ్మానియాక్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది.
పెద్ద హీరోల సినిమాలు కాకపోయినా, డిఫరెంట్ కంటెంట్ మరియు బోల్డ్ జోనర్ ఇష్టపడే ఆడియెన్స్‌ను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేవలం మౌత్ టాక్‌తో నేషనల్ వైడ్ ట్రెండింగ్‌లో నిలవడం ద్వారా తెలుగు సినిమా సత్తా మరోసారి చాటిచెప్పింది.