
నటుడు రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘ఇరుముడి’. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై హృద్యమైన కథ చెప్పబోతున్నారనే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ప్రేక్షకులకు, మరీ ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులకు హైప్ ఇచ్చే పాట ‘‘విల్లాలివీరుడు.. వీర మణికంఠుడు’’ అదేనండీ.. ‘‘మల్లెపూల పల్లకి.. బంగారు పల్లకి’’ సాంగ్ను ప్రీ రిలీజ్ ఈవెంట్లో విడుదల చేశారు. రవితేజ నృత్యం, జీవీ ప్రకాష్ సంగీతం, యథాతథంగా వాడుకున్న లిరిక్స్.. అన్నీ బాగున్నాయి. కానీ.. ఈ పాట పాడిన డప్పు శీను వాయిస్లో మునుపటి మ్యాజిక్ కనిపించలేదు.
అయ్యప్ప భజన పాటల్లోనే హైలైట్ సాంగ్ అయిన ఈ పాటను అప్పట్లో పాడింది డప్పు శీను. అందుకే.. ఆయనతోనే ఇన్నేళ్ల తర్వాత కూడా పాటను పాడించారు. కానీ.. ఒరిజినల్ సాంగ్ను మ్యాచ్ కాలేకపోయింది. వోకల్స్పై ఈ పాట విన్న శ్రోతలు యూట్యూబ్లో ఈ సాంగ్ కింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారో చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. వింటున్న శ్రోతలకు వోకల్స్ ఇబ్బందిగా అనిపించాయి.
ఒరిజినల్ సాంగ్ను సినిమాలో ఉన్నది ఉన్నట్లు వాడినా అయిపోయేదనే అభిప్రాయాన్ని మెజారిటీ శ్రోతలు వ్యక్తం చేశారు. ఈ పాటపై ఓవర్ హైప్ కూడా ఈ అభిప్రాయానికి కారణం అయి ఉండొచ్చనే వాదన కూడా ఉంది. కొన్ని పాటలు ‘‘తినగ.. తినగ.. వేము తియ్యగనుండు’’ అనే తరహాలో వినగా.. వినగా.. అభిప్రాయాన్ని మార్చేస్తాయి. ఒక్క విషయం అయితే నిజం. వోకల్స్ ఎలా ఉన్నా.. ఈ పాట థియేటర్లో వచ్చినప్పుడు ప్రేక్షకులు మంచి హై ఫీలవుతారని మాత్రం చెప్పొచ్చు. ఇరుముడి సినిమా ఆగస్ట్ 21న థియేటర్లలో విడుదల కానుంది.