Reading Time: 2 minutes

నువ్వు అమెరికా వెళ్లొచ్చు..పేద పిల్లలు వెళ్లొద్దా?…కేటీఆర్‌‌‌‌పై మంత్రి వివేక్ వెంకటస్వామి ధ్వజం

Caption of Image.
  • ఏటీసీ సెంటర్లలో జర్మన్ లాంగ్వేజ్ శిక్షణపై హేళనగా మాట్లాడుతున్నరు
  •     జపాన్, జర్మనీలో 5 లక్షల ఉద్యోగాలు ఉన్నయ్​
  •     ఆ భాషలు నేర్చుకుంటే రూ.25 లక్షల జీతంతో ఉద్యోగాలు వస్తయ్‌‌
  •     కాళేశ్వరం కుంగినప్పుడు హరీశ్ ఎందుకు చర్చ పెట్టలేదని ప్రశ్న 
  •     మహబూబ్‌‌నగర్‌‌‌‌లో ఏటీసీ సెంటర్​ ఏర్పాటుకు భూమి పూజ

మహబూబ్​నగర్​/చిన్నచింతకుంట, వెలుగు: ‘‘కేటీఆర్.. నువ్వు అమెరికా వెళ్లావ్. అక్కడ చదువుకొని, ఉద్యోగాలు చేశావ్. బాగా సంపాదించుకొని వచ్చావ్.. కానీ తెలంగాణలోని పేద పిల్లలు విదేశాలకు వెళ్లొద్దా? జర్మన్, జపాన్ భాషలు నేర్చుకొని ఉద్యోగాలు చేయొద్దా?’’అని మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం లాల్ కోట-, నెల్లికొండ గ్రామాల మధ్య రూ.44 కోట్లతో ఏర్పాటు చేయనున్న అడ్వాన్స్‌‌డ్ టెక్నాలజీ సెంటర్​(ఏటీసీ) భవన నిర్మాణానికి భూమిపూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా మంత్రి​ మాట్లాడుతూ.. ఏటీసీ సెంటర్లలో జర్మన్ లాంగ్వేజ్ శిక్షణపై హేళనగా మాట్లాడుతున్నారని, కేటీఆర్‌‌‌‌ను ఆయన తండ్రి కేసీఆర్ ఇంగ్లిష్ నేర్చించి అమెరికా పంపించారని, మన పిల్లలకు జర్మన్ భాష నేర్చుకొని వెళ్తుంటే ఆయనకు ఏం బాధ అని ప్రశ్నించారు. జర్మనీ నేర్చుకుంటే ఆ దేశంలో రూ.25 లక్షల జీతంతో ఉద్యోగం వస్తోందని, జర్మనీ, జపాన్ దేశాల్లో 5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. త్వరలో దేవరకద్రలో బ్రహ్మోస్ మిస్సైల్ యూనిట్, మరో జాతీయ కంపెనీ రాబోతున్నాయని తెలిపారు. ఈ రెండు కంపెనీల్లో స్కిల్స్ ఉన్న వారికి రూ.50 వేల వరకు జీతంతో ఉద్యోగాలు దొరుకుతాయన్నారు. 

శ్రమ, పట్టుదలతో ఏటీసీల్లో శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించుకోవాలని యువతకు మంత్రి సూచించారు. రాష్ట్రంలో బీఆర్‌‌‌‌ఎస్ పదేండ్ల పాలనలో ఒక్క ఏటీసీ సెంటర్‌‌‌‌ను కూడా ఓపెన్ చేయలేదని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలోనే 50 వేల టీచర్ల పోస్టులతోసహా లక్ష ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. దేవకరద్ర నియోజకవర్గానికి ఒక ఏటీసీ సెంటర్‌‌‌‌ను మంజూరు చేశామన్నారు. ఈ సెంటర్ సక్సెస్ అయితే వచ్చే ఏడాది రెండవ సెంటర్ మంజూరు చేస్తామని చెప్పారు. 

కాళేశ్వరం ఎందుకు కుంగిందో చర్చించరా? 

కాంగ్రెస్ హయాంలో నిర్మించిన పోచంపాడు, నాగార్జున సాగర్​, శ్రీశైలం, జూరాల లాంటి ప్రాజెక్టులు ధృడంగా ఉన్నాయని, కేసీఆర్​సూచనలతో రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం కొన్ని నెలలకే ఎందుకు కుంగిపోయిందని మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. హరీశ్ రావు, కేటీఆర్ కాళేశ్వరం ఎందుకు కుంగిపోయిందో మాట్లాడకుండా.. ఈ ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయాలని ఎందుకు చర్చలు పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. గతంలో కాళేశ్వరం నుంచి 60 టీఎంసీలు ఎల్లంపల్లికి ఎత్తిపోయడానికి రూ.3 వేల కోట్ల విద్యుత్ ఖర్చు అయ్యిందని గుర్తుచేశారు. ఎత్తిపోసిన వెంటనే ఎల్లంపల్లికి ఎగువ నుంచి నీళ్లు వచ్చాయని, దీంతో లిఫ్ట్ చేసిన 60 టీఎంసీల నీరు వృథా అయ్యిందన్నారు. 

బీఆర్‌‌‌‌ఎస్‌‌కు ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దోచుకోవడం తప్ప ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన లేదని మండిపడ్డారు. బీఆర్‌‌‌‌ఎస్ లీడర్లు సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై బుదరజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పదేండ్లలో రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని, వీటిపై నెలకు రూ.6 వేల కోట్ల చొప్పున ఇప్పటివరకు తమ ప్రభుత్వం దాదాపు రూ.3 లక్షల కోట్ల మిత్తి కట్టిందన్నారు. బీఆర్ఎస్ దిగిపోయేనాటికి కాంట్రాక్టర్లకు రూ.43 వేల కోట్లు బకాయిలు పెట్టిందన్నారు. మహారాష్ట్రలో బీఆర్‌‌‌‌ఎస్ ఏర్పాటు కోసం హరీశ్ రావు రూ.500 కోట్లు ఖర్చు చేశారని, ఈ డబ్బు కార్మికుల కోసం ఖర్చు చేసి ఉంటే వారి జీవితాలు బాగుపడేవన్నారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ మధుసూదన్ నాయక్, రాష్ట్ర ఉపాధి, శిక్షణ సంస్థ డైరెక్టర్ రాజేశ్​, జాయింట్ డైరెక్టర్ నరేష్, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సీతారాములు, జిల్లా ఉపాధి కల్పన అధికారి మైత్రి ప్రియ, చిన్నచింతకుంట తహసీల్దార్​ఎల్లన్న పాల్గొన్నారు.

ఏటీసీ సెంటర్లలో ఆరు విభాగాల్లో శిక్షణ: ఎమ్మెల్యేమధుసూదన్ రెడ్డి 

పల్లమర్రి ఏటీసీ సెంటర్‌‌‌‌లో యువతకు ఆరు విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ సెంటర్ ద్వారా నియోజకవర్గంలోని యువతకు టెన్త్ తర్వాత నైపుణ్య శిక్షణ లభిస్తుందని చెప్పారు. ఈసెంటర్‌‌‌‌లో శిక్షణ పొంది బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్, ఇతర పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు పొందాలని సూచించారు. బీసీ కార్మికుల కోసం ఈఎస్‌‌ఐ డిస్పెన్సరీ మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరగా, ప్రతిపాదనలు పంపించాలని మంత్రి వివేక్ చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.