Reading Time: < 1 minute
Bulgaria Emerges As Top Shooting Hub For Indian Cinema Rrr Line Producer Todor Lazarov

భారతీయ చలనచిత్ర పరిశ్రమ తన పరిధులను అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తున్న వేళ, యూరప్‌లోని బల్గేరియా దేశం ఇండియన్ ఫిల్మ్ మేకర్స్‌కు ఘన స్వాగతం పలుకుతోంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలు, సహజసిద్ధమైన లొకేషన్లు మరియు భారీ ఆర్థిక ప్రయోజనాలతో భారతీయ చిత్రాలకు సరికొత్త ప్రొడక్షన్ హబ్‌గా మారేందుకు బల్గేరియా సిద్ధమైంది. తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ బల్గేరియా షెడ్యూల్ ప్రొడక్షన్ మేనేజర్‌గా, లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన టోడర్ లాజరోవ్ జుజి అందుకు కారణమయ్యారు.  ఇండియన్ సినీ పరిశ్రమతో సుదీర్ఘకాలం పనిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన, ఇండియన్ మేకర్స్‌కు బల్గేరియాను సమగ్ర సినీ నిర్మాణ భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చారు.

“బల్గేరియా అంటే కేవలం అందమైన షూటింగ్ లొకేషన్ మాత్రమే కాదు, ప్రీ-ప్రొడక్షన్ నుంచి పోస్ట్-ప్రొడక్షన్ వరకు సమగ్ర సేవలు అందించే ఫుల్-లేయర్ ఫిల్మ్ ప్రొడక్షన్ పార్ట్‌నర్. యూరప్‌లో భారతీయుల సినిమా మేకింగ్‌ను వేగవంతంగా, తక్కువ ఖర్చుతో పూర్తి చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం”.— టోడర్ లాజరోవ్ జుజి

  1. 25% క్యాష్ రిబేట్: అర్హత ఉన్న సినిమాలకు ఏకంగా 25 శాతం నగదు రీఫండ్ పొందే వెసులుబాటు ఉంది.

  2. అత్యల్ప పన్నుల విధానం: యూరప్‌లోని దేశాల్లోనే అత్యంత తక్కువ కార్పొరేట్ టాక్స్ ఉన్న దేశాల్లో బల్గేరియా ఒకటి.

  3. బడ్జెట్ : ఇతర యూరోపియన్ దేశాలతో పోలిస్తే ఇక్కడ నిర్మాణ వ్యయం చాలా తక్కువగా ఉంటుంది.

  4. అడ్వాన్స్‌డ్ VFX & పోస్ట్-ప్రొడక్షన్: అత్యున్నత స్థాయి వీఎఫ్‌ఎక్స్ (VFX), గ్రాఫిక్స్ (CGI) మరియు వరల్డ్ క్లాస్ పోస్ట్-ప్రొడక్షన్ సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

  5. వైవిధ్యభరిత లొకేషన్లు: రోమన్ శిథిలాలు, మధ్యయుగం నాటి కోటలు, నల్ల సముద్ర తీరాలు (Black Sea), పర్వతాలు, అడవులతో పాటు మోడరన్ నగరాలు చిత్రీకరణకు సిద్ధంగా ఉన్నాయి.

భారతీయ సంస్కృతిపై తనకున్న అమితమైన ప్రేమతో, ఆశిష్ గణేషన్‌తో కలిసి తాను ఒక భారీ సూపర్ హీరో చిత్రాన్ని నిర్మించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నట్లు జుజి వెల్లడించారు. ఈ సినిమాలోని ప్రధాన భాగాలను బల్గేరియాలో చిత్రీకరిస్తున్నామని, భారతీయ ప్రతిభతో పని చేయడం తన అదృష్టమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.