Reading Time: < 1 minute
Dhanush Breaks Silence On Raayan National Award Row Defends Tamil Cinema

Dhanush: జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘రాయన్’ ఉత్తమ తమిళ చిత్రంగా ఎంపిక కావడంతో తమిళ సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా ‘మెయ్యళగన్’, ‘మహారాజా’ వంటి ప్రశంసలు అందుకున్న సినిమాలకు అవార్డు దక్కకపోవడంపై సినీ అభిమానులు, విమర్శకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారి స్పందించిన నటుడు ధనుష్ ఎంతో హుందాగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ అవార్డుపై వస్తున్న విమర్శలను తాను తప్పుగా భావించడం లేదని ధనుష్ చెప్పారు. ‘మెయ్యళగన్’, ‘మహారాజా’ వంటి చిత్రాలు కూడా జాతీయ అవార్డుకు పూర్తిగా అర్హమైనవేనని అంగీకరించారు. మంచి సినిమాలు ఎన్నో పోటీలో ఉన్నప్పుడు భిన్నమైన అభిప్రాయాలు రావడం సహజమని పేర్కొన్నారు.

అయితే తన కెరీర్‌ను గుర్తు చేసుకున్న ధనుష్, ‘పుదుపేట్టై’, ‘మర్యాన్’, ‘కర్ణన్’, ‘రాంఝానా’, ‘వడ చెన్నై’ వంటి తన కెరీర్‌లో అత్యంత ప్రశంసలు అందుకున్న సినిమాలకు జాతీయ అవార్డు గుర్తింపు రాలేదని గుర్తుచేశారు. ఆ సమయంలో వాటి కోసం పెద్దగా ఎవరూ మాట్లాడలేదని, ఇప్పుడు మాత్రం ఒక్క అవార్డు విషయంలో పెద్ద చర్చ జరగడం తనకు ఆశ్చర్యంగా అనిపించిందని చెప్పారు. సినిమా విలువను కేవలం అవార్డులతో మాత్రమే కొలవలేమని ధనుష్ అభిప్రాయపడ్డారు. ప్రేక్షకుల ప్రేమ, చిరస్థాయిగా నిలిచిపోయే గుర్తింపే ఒక సినిమాకి అసలైన విజయమని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నటుడు అజిత్ కుమార్ చెప్పిన ‘మీరు మీ ఓటమిని అంగీకరించే వరకు మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు’ అనే మాటలను గుర్తు చేస్తూ, అదే తన జీవితంలో కూడా నమ్మే సిద్ధాంతమని వెల్లడించారు. చివరగా ఒక అవార్డు చుట్టూ జరిగే వివాదాల కంటే తమిళ సినిమా సాధించిన విజయాలను అందరూ కలిసి సెలబ్రేట్ చేయాలని ధనుష్ పిలుపునిచ్చారు. విభేదాలను పెంచడం కంటే మంచి సినిమాలను ప్రోత్సహించడం, కళాకారుల కృషిని గౌరవించడం ముఖ్యమని ఆయన సందేశం ఇచ్చారు. ధనుష్ చేసిన ఈ హుందా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  చర్చకు దారితీశాయి.