Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్‌ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?

సినిమా చూడాలనిపిస్తే ఒక బాయ్ ఫ్రెండ్‌ను బుక్ చేసుకోవచ్చు. షాపింగ్ వెళ్లాలనుకుంటే గంటల లెక్కన మీతో తిరిగే ఓ అబ్బాయి దొరుకుతాడు. కాఫీ తాగుతూ మాట్లాడుకోవాలన్నా, ఆస్పత్రికి తోడుగా ఎవరైనా కావాలన్నా, ఇప్పుడు అందుకు కూడా డబ్బు చెల్లించి ఒక వ్యక్తిని అద్దెకు తీసుకునే రోజులు వచ్చేశాయి. క్యాబ్ బుక్ చేసినంత ఈజీగా ఇప్పుడు బాయ్ ఫ్రెండ్‌ను కూడా బుక్ చేసుకునే ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒకప్పుడు జపాన్‌కు మాత్రమే పరిమితమైన ఈ కాన్సెప్ట్ ఇప్పుడు భారత్‌లో కూడా కనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ అసలు ఈ రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ ట్రెండ్ ఎలా మొదలైంది? ఎందుకు ఇంత వేగంగా విస్తరిస్తోంది. దీని వెనుక ఉన్న బిజినెస్ మోడల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ కాన్సెప్ట్ ఎలా పుట్టింది?
రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ అనే కాన్సెప్ట్ ఒక్కరోజులో పుట్టలేదు. దీని మూలాలు 90దశకంలో జపాన్‌లో ప్రారంభమైన రెంటల్ పర్సన్ ఎకానమీ వరకు వెళ్తాయి. అప్పట్లో కుటుంబ సభ్యుల్లా నటించే వారు, స్నేహితుల్లా మాట్లాడేవారు, బాధలు వినేవారు, సామాజిక కార్యక్రమాలకు తోడుగా వెళ్లేవారు.
నిజ జీవితంలో ఎవరు అందుబాటులో లేకపోయినా లేదా కొన్ని సందర్భాల్లో ఒంటరిగా వెళ్లడం ఇబ్బందిగా అనిపించినా కొద్ది గంటల పాటు ఒక వ్యక్తిని అద్దెకు తీసుకోవడం అక్కడ సాధారణంగా మారింది. పెళ్లికి తోడుగా ఎవరైనా కావాలన్నా, బ్రేకప్ తర్వాత మనసులోని మాట చెప్పుకోవాలన్నా, కుటుంబ వేడుకల్లో ఒంటరిగా కనిపించకుండా ఉండాలన్నా ఇలాంటి సేవలను ఉపయోగించేవారు. ఆ తర్వాత 2010లో ఈ సేవలు రెంటల్ గర్ల్ ఫ్రెండ్, రెంటల్ బాయ్ ఫ్రెండ్ అనే పేర్లతో మరింత ప్రాచుర్యం పొందాయి.
పేరు విన్న వెంటనే చాలా మందికి ఇది వేరే రకమైన సేవలేమో అనిపించవచ్చు. కానీ వాస్తవానికి చాలా సంస్థలు కఠినమైన నిబంధనలతోనే ఈ సేవలను అందిస్తున్నాయి. శారీరక సంబంధాలకు అనుమతి ఉండదు. హోటల్ గదులకు వెళ్లకూడదు. ఒంటరిగా ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు. రాత్రంతా కలిసి ఉండే అవకాశం ఉండదు. ఎప్పుడూ మర్యాదపూర్వకంగా మాత్రమే వ్యవహరించాలి. అంటే కస్టమర్ డబ్బు చెల్లించేది ప్రేమ కోసం కాదు. కొంతసేపు మాట్లాడేందుకు, సమయం గడపడానికి, ఒంటరితనాన్ని తగ్గించుకోవడానికి మాత్రమే.
ధర ఎంత చెల్లించాలి?
జపాన్‌లో ఈ సేవలు ఎందుకు అంతగా ప్రాచుర్యం పొందడానికి కారణం అక్కడి జీవనశైలిగా చెప్పవచ్చు. ఎక్కువ గంటలు పనిచేయడం, ఒంటరిగా జీవించడం, భావోద్వేగాలను బయటపెట్టకపోవడం, ఇతరులను ఇబ్బంది పెట్టకూడదనే సంస్కృతి కారణంగా చాలా మంది తమ మనసులోని మాట చెప్పుకునేందుకు ఇలాంటి సేవలను ఎంచుకుంటున్నారు. అందుకే అక్కడ గంటకు రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ సేవలకు భారత కరెన్సీలో దాదాపు 1700 నుంచి 3500 రూపాయల వరకు ఖర్చవుతుంది. భోజనం, ప్రయాణం, ఇతర కార్యక్రమాలు కలిస్తే ఈ మొత్తం ఇంకా పెరుగుతుంది.
సోషల్ మీడియా రావడంతో ఈ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, టిక్ టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్లు జపాన్ వెళ్లి రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ అనుభవాలను వీడియోలుగా పంచుకోవడం ప్రారంభించారు. ఒక యూట్యూబ్ క్రియేటర్ గంటకు దాదాపు 8500 రూపాయలు చెల్లించి ఒక రెంటల్ బాయ్ ఫ్రెండ్‌ను బుక్ చేసుకుంది. ఇద్దరూ కలిసి చేతులు పట్టుకుని తిరిగారు. ఫొటోలు దిగారు. రెస్టారెంట్‌లో భోజనం చేశారు. చివరకు సమయం అయిపోయినా ఇంకా సరదాగా ఉందని బుకింగ్‌ను పొడిగించింది. ఇలాంటి వీడియోలకు లక్షల నుంచి కోట్ల వరకు వ్యూస్ రావడంతో ఈ ట్రెండ్ మరింత వేగంగా విస్తరించింది.
ఇలాంటి సేవలు అందించే కొందరు తమకు నెలకు 10మందికిపైగా కస్టమర్లు వస్తారని చెబుతున్నారు. వీరిలో యూనివర్సిటీ విద్యార్థినులు, విడాకులు తీసుకున్న మహిళలు, వివాహితులు కూడా ఉన్నారని సమాచారం. చాలామంది దీన్ని ప్రేమగా కాకుండా ఒక కొత్త అనుభవంగా లేదా ట్రావెల్ యాక్టివిటీగా చూస్తున్నారు. ఇలా జపాన్ నుంచి మొదలైన ఈ కాన్సెప్ట్ ఇప్పుడు భారత్‌లోకి కూడా వచ్చింది.
అయితే ఇక్కడ జపాన్ లాంటి పెద్ద ఏజెన్సీలు లేకపోయినా సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, వెబ్‌సైట్లు ఈ సేవలను అందిస్తున్నాయి. కోపార్ట్నర్ అనే వెబ్‌సైట్ తమను ప్రొఫెషనల్ సోషల్ సపోర్ట్ సర్వీసెస్‌గా పరిచయం చేసుకుంటోంది. ఇందులో హ్యాంగ్ అవుట్ కోసం గంటకు 1500 రూపాయలు, క్లబ్బింగ్, మూవీ పార్ట్నర్, షాపింగ్ బడ్డీ, మెడికల్ సపోర్ట్ కోసం కూడా గంటకు 2000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక్కడ డేట్ లేదా బాయ్ ఫ్రెండ్ అనే పదాల కంటే సోషల్ సపోర్ట్, కంపానియన్ లాంటి పదాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
నెల్ అనే మరో ప్లాట్‌ఫామ్‌లో ఉద్యోగాల వెబ్‌సైట్ మాదిరిగానే తమ ప్రొఫైళ్లను అప్‌లోడ్ చేసి కంపానియన్ సేవలు అందించేందుకు అవకాశం ఉంది. అలాగే అంతర్జాతీయంగా పనిచేస్తున్న రెంట్ ఏ ఫ్రెండ్ వెబ్ సైట్‌లో కూడా ఈవెంట్లకు తోడుగా రావడం, నగరం చూపించడం, కలిసి భోజనం చేయడం, స్నేహితుడిగా సమయం గడపడం లాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. అక్కడ గంటకు 11 నుంచి 15 డాలర్ల వరకు ధరలు కనిపిస్తున్నాయి. కొన్ని భారతీయ ప్రొఫైళ్లు కూడా అందులో ఉన్నాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఈ ట్రెండ్ మరింత ఆసక్తికరంగా మారింది. రెంట్ యువర్ ఓన్ బాయ్ ఫ్రెండ్ ఇండియా అనే పేజీకి 10000 మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. కాఫీ డేట్లు, షాపింగ్, కార్ సెల్ఫీలు, ఆకర్షణీయమైన పోస్టులతో ఈ సేవలను ప్రచారం చేస్తున్నారు. మరి ఈ సేవలను ఎవరు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అంటే ప్రధానంగా పట్టణాల్లో నివసించే 20ఏళ్ల వయసులోని మహిళలే అని తెలుస్తోంది. కొందరు సోషల్ మీడియా కంటెంట్ కోసం బుక్ చేసుకుంటే మరికొందరు నిజంగానే ఒంటరితనాన్ని తగ్గించుకోవడానికి ఈ సేవలను ఎంచుకుంటున్నారు.
మరోవైపు బాయ్ ఫ్రెండ్‌గా సేవలు అందించే యువకులు మాత్రం అదనపు ఆదాయం కోసం ఈ రంగంలోకి వస్తున్నారు. ఒక్క మూవీ పార్ట్నర్ సేవకే గంటకు 2000 రూపాయలు వస్తే నెలకు 5బుకింగ్‌లు వచ్చినా మంచి సంపాదన అవుతుందని భావిస్తున్నారు. అయితే ఈ పని చేయాలంటే వ్యక్తిగత సంరక్షణ, సమయపాలన, మంచి కమ్యూనికేషన్, ఎదుటివారిని సౌకర్యంగా ఫీల్ అయ్యేలా చేసే నైపుణ్యం అవసరమని చెబుతున్నారు.
ప్రస్తుతం భారత్‌లో ఈ రంగానికి స్పష్టమైన నియంత్రణలు లేవు. ఒకే సంస్థ ఆధిపత్యం కూడా లేదు. ఎక్కువ సేవలు సోషల్ మీడియా లేదా వ్యక్తిగత ఏర్పాట్ల ద్వారానే కొనసాగుతున్నాయి. అయినప్పటికీ గంటల లెక్కన కంపానియన్ సేవలను బహిరంగంగానే ప్రచారం చేయడం చూస్తుంటే ఇది సరదా ట్రెండ్ స్థాయిని దాటి కొత్త వ్యాపారంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.