July 14, 2026

మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్

మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
Reading Time: 2 minutes
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్

భూమిపై ఏ క్షీరదం కూడా జీవించలేని అత్యంత కఠినమైన, ప్రాణాంతక వాతావరణంలో ఒక చిన్న జీవి మనుగడ సాగిస్తూ సరికొత్త రికార్డు సృష్టించింది. దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లో సుమారు 22,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నివసిస్తున్న ‘ఆండియన్ లీఫ్-ఇయర్డ్ మౌస్’ అనే చిన్న చిట్టెలుక శాస్త్రవేత్తలకు సైతం సవాలు విసురుతోంది. చిలీ, అర్జెంటీనా దేశాల సరిహద్దుల్లోని ‘పునా డి అటకామా’ అగ్నిపర్వత శిఖరాలపై ఈ ఎలుకలు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇక్కడ సముద్ర మట్టంతో పోలిస్తే ఆక్సిజన్ కేవలం 44 శాతమే ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఎల్లప్పుడూ మైనస్ డిగ్రీల్లోనే నమోదవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ క్షీరదం కూడా ఎక్కువ కాలం జీవించలేదని శాస్త్రవేత్తలు భావించారు. నెబ్రాస్కా-లింకన్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు జే స్టోర్జ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ శిఖరాలపై యాత్రలు చేసి, ఎలుకలను సజీవంగా పట్టుకోవడంతో పాటు మంచులో గడ్డకట్టిన వాటి మమ్మీలను కూడా సేకరించింది. ఈ ఎలుకలు అక్కడ కేవలం బతకడమే కాదు, తమ సంతతిని కూడా వృద్ధి చేసుకుంటున్నాయని తేలడం శాస్త్రవిజ్ఞానానికి పెద్ద సవాలుగా మారింది. ‘సైన్స్’ జర్నల్‌లో ప్రచురించిన తాజా అధ్యయనం ఈ ఎలుకల అద్భుత సామర్థ్యాల వెనుక ఉన్న రహస్యాలను వెల్లడించింది. ఇంతటి విపత్కర వాతావరణాన్ని ఈ ఎలుకలు ఎలా తట్టుకుంటున్నాయో తెలుసుకోవడానికి జన్యు పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. వీటి శరీరంలో వేడిని పుట్టించే ప్రక్రియ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోంది. ఇవి ఆక్సిజన్ కొరతను తట్టుకోవడానికి రక్తాన్ని చిక్కబరిచే ఎర్ర రక్తకణాలను పెంచడం లేదు. దానికి బదులుగా, అత్యంత వేగంగా శ్వాస తీసుకుంటూ అవసరమైన ప్రాణవాయువును గ్రహిస్తున్నాయి. అంతేకాదు, అక్కడి విషపూరిత మొక్కలను అరిగించుకునేలా, కొవ్వును త్వరగా శక్తిగా మార్చుకునేలా వీటి జన్యువులు రూపాంతరం చెందాయి. ఈ చిన్న ఎలుకపై జరుగుతున్న పరిశోధనలు భవిష్యత్తులో మానవ వైద్య రంగానికి మైలురాయిగా మారనున్నాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్ బారిన పడినప్పుడు మానవ శరీర కణాలు తీవ్ర ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటాయి. తక్కువ ఆక్సిజన్ ఉన్నప్పుడు ఈ ఎలుకల కణాలు ఎలా శక్తిని ఉత్పత్తి చేసుకుంటున్నాయో పూర్తిగా అర్థం చేసుకుంటే, మానవులలో వచ్చే ఆయా ప్రాణాంతక వ్యాధులకు సరికొత్త చికిత్సా విధానాలను కనుగొనవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా!

పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం