July 14, 2026

Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..

Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
Reading Time: < 1 minute
Yashs Toxic Tops Imdb Most Anticipated Indian Movies List Ahead Of Release

Toxic: ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ ఇప్పుడు ‘టాక్సిక్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ భారీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఇప్పటికే భారీ అంచనాలతో వస్తోంది. ఇప్పుడు ఆ అంచనాలకు మరింత హైప్ తెచ్చేలా మరో ఘనతను ఈ సినిమా సొంతం చేసుకుంది. ప్రముఖ మూవీ డేటాబేస్ ప్లాట్‌ఫామ్ IMDb విడుదల చేసిన తాజా జాబితాలో ‘టాక్సిక్’ ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీగా మొదటి స్థానంలో నిలవడం విశేషంగా మారింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి నుంచే భారీ అంచనాలతో నిలుస్తోంది. యష్‌ను పూర్తిగా కొత్త అవతారంలో చూపించనున్న ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. విడుదలకు ముందు పలుమార్లు వాయిదా పడినప్పటికీ ప్రేక్షకుల ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా విడుదలైన ‘లేడీస్ అండ్ లేడీస్’ టీజర్‌తో పాటు ‘తబాహి’ పాటకు వచ్చిన అద్భుత స్పందన సినిమాపై అంచనాలను మరింత పెంచింది. సోషల్ మీడియాలో ఈ ప్రమోషనల్ కంటెంట్‌కు వచ్చిన స్పందన కూడా సినిమాపై ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది.

ఇప్పుడు IMDb తాజా ర్యాంకింగ్స్‌లో ‘టాక్సిక్’ అగ్రస్థానంలో నిలవడం చిత్రబృందానికి మరో పెద్ద ఊరటనిచ్చింది. ఈ జాబితా సెర్చ్ ట్రెండ్స్ వంటి అంశాల ఆధారంగా రూపొందుతుండటంతో, విడుదలకు ముందే ఈ స్థాయి గుర్తింపు రావడం విశేషంగా భావిస్తున్నారు. దీంతో ఆగస్టు 26 విడుదలకు ముందు సినిమాపై బజ్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. యష్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స్టార్ క్యాస్టింగ్, గీతూ మోహన్ దాస్ ప్రత్యేక మేకింగ్ శైలి కలిసి ‘టాక్సిక్’ను ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలబెట్టాయి. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.