July 13, 2026

Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్‌.. సీఎస్‌ కీలక సమావేశం..

Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్‌.. సీఎస్‌ కీలక సమావేశం..
Reading Time: < 1 minute
Andhra Pradesh Begins Preparations For Second Phase Direct Recruitment Job Calendar

Andhra Pradesh Job Calendar: ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ జాబ్ క్యాలెండర్ రూపకల్పన ప్రక్రియ వేగం పుంజుకుంది. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ అధ్యక్షతన కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశం నిర్వహించి నియామకాల విధివిధానాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్లు, ఈ-హెచ్‌ఆర్‌ఎం ప్రక్రియ పూర్తి చేయడం, స్థానిక కేడర్ వ్యవస్థకు అనుగుణంగా నియామకాలు చేపట్టడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే కొత్త స్థానిక కేడర్లలో పోస్టుల కేటాయింపు, సీనియారిటీ జాబితాల ఖరారు, రోస్టర్ల ప్రారంభం, అభ్యర్థుల కేటాయింపు, నియామక సంస్థలకు ఇండెంట్లు పంపడం వంటి అంశాలను అధికారులు పరిశీలించారు.

సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్‌.ఎస్‌. రావత్‌, బి. రాజశేఖర్‌, కృష్ణబాబు, జి. జయలక్ష్మి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. త్వరలోనే రెండో దశ జాబ్ క్యాలెండర్‌కు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కాగా, ఈ ఏడాది మార్చి 19వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో 10,060 పోస్టుల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన విషయం విదితమే.. ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్‌ అప్పట్లో ఎక్స్‌లో పేర్కొంటూ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేశారు.. ఇక, ఇప్పుడు రెండో దశ జాబ్‌ క్యాలెండర్‌ విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది..