Reading Time: 2 minutes
Ys Jagan Assures Support To Dsc Candidates Promises Legal Aid And Reinvestigation

YS Jagan: డీఎస్సీ నియామక ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన అభ్యర్థులకు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. న్యాయపరంగా పోరాటం చేసే అభ్యర్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయ సహాయాన్ని అందించడమే కాకుండా లీగల్ ఖర్చులన్నింటినీ పార్టీ భరిస్తుందని హామీ ఇచ్చారు. అభ్యర్థులతో సమావేశమైన జగన్ మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఇప్పటికే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం అన్యాయం జరిగిందని ఆరోపణలు వస్తున్న ప్రతి కేసుపై భవిష్యత్తులో రీ-ఎంక్వైరీ నిర్వహిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ చేపడతామని చెప్పారు.

స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై జగన్ ప్రశ్నలు లేవనెత్తారు. పరీక్షలు నిర్వహించకుండా కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వడానికి జీవో జారీ చేశారని, నియామకాలు పూర్తయ్యాక అదే జీవోను మార్చి కొత్త జీవో తీసుకువచ్చారని విమర్శించారు. మొదట తీసుకొచ్చిన జీవో ఎవరికోసం, ఎవరికి ప్రయోజనం చేకూర్చడానికి అన్నది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కొందరికి మేలు చేసేలా వ్యవస్థను ఉపయోగించుకుని, పని పూర్తయిన తర్వాత జీవోను ఉపసంహరించుకున్నారని ఆరోపించారు. క్రీడా కోటా పోస్టుల భర్తీలో పారదర్శకత కనిపించడం లేదని జగన్ వ్యాఖ్యానించారు. మొదటి ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు రాకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. వెరిఫికేషన్‌కు హాజరు కాలేదనే కారణాలు చెబుతున్నప్పటికీ, అదే అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడం వెనుక కారణాలను ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు.

డీఎస్సీ పరీక్షల నుంచి నియామకాల వరకు అనేక అంశాలు వివాదాస్పదంగా మారాయని జగన్ అన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణల నుంచి ఎంపికల వరకు అనేక అంశాలు బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. అభ్యర్థుల గ్రీవెన్స్‌లకు కూడా సరైన సమాధానాలు ఇవ్వడం లేదని, ప్రభుత్వం చెబుతున్న వివరాల్లో స్పష్టత, పారదర్శకత లోపించాయని విమర్శించారు. ఇదిలా ఉండగా, మీడియాతో మాట్లాడిన డీఎస్సీ అభ్యర్థులు కూడా నియామక ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటాలో టెట్, బీఈడీ వంటి అర్హతలు లేకపోయినా కొందరికి ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు. 1:1 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు పిలిచినప్పటికీ తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని వాపోయారు.

అలాగే కొందరి పేర్లు ఎంపికైన వారి జాబితాలోనూ, తిరస్కరించిన వారి జాబితాలోనూ లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు జగన్. ఈ విషయంపై అధికారులను ప్రశ్నిస్తే తమ పోస్టులను స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు కేటాయించామని సమాధానం చెబుతున్నారని ఆరోపించారు. నేషనల్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన అభ్యర్థులను కూడా పక్కన పెట్టారని పేర్కొన్నారు. జరిగిన పరిణామాలు, అనుమానాలు, అవకతవకలపై పూర్తి వివరాలను జగన్ దృష్టికి తీసుకెళ్లామని అభ్యర్థులు తెలిపారు. తమ సమస్యలను ఆయన ఓపికగా విన్నారని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జగన్ భరోసా ఇచ్చారని వెల్లడించారు.