Reading Time: 2 minutes
El Nino 2026 Centre Alert Farmers Protection Rainfall Concerns India

ఈ ఏడాది ప్రపంచానికి ఎల్‌నినో ముప్పు ముంచుకొస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రమాదకర ఎల్‌నినో రాబోతుందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. జూన్-ఆగస్టు మధ్య ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశాలు 80 శాతం ఉన్నాయని డబ్ల్యూఎంఓ వెల్లడించింది. ఈ మేరకు ప్రపంచ దేశాలను హెచ్చరికస్తూ అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది.

డబ్ల్యూఎంఓ నివేదిక ప్రకారం.. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర జలాల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల ఎల్‌నినో పరిస్థితులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే అనేక ప్రాంతాల్లో వర్షపాతం నమూనాలు మారిపోయి తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నారు.

శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందన..


ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ఎల్‌నినోపై ఆందోళన అవసరం లేదని.. కానీ ముందస్తు సన్నద్ధత మాత్రం చాలా ముఖ్యమని తెలిపారు. రైతుల ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుతామని స్పష్టం చేశారు. తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న రాష్ట్రాలు, జిల్లాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. విత్తనాల అందుబాటు, నేలలో తేమ సంరక్షణ, నీటి నిర్వహణ, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు సాధారణ స్థాయికంటే మెరుగ్గా ఉన్నాయని, ఇది ఖరీఫ్ పంటలకు కొంత ఊరటనిస్తోందని పేర్కొన్నారు. అయితే పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇదిలా ఉండగా ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటి ఎల్‌నినో ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు. 2026-27 వ్యవసాయ సంవత్సరం కరువు సంవత్సరంగా మారే అవకాశాలు ఉన్నాయని, వ్యవసాయ వృద్ధి రేటు 1 శాతం కంటే దిగువకు పడిపోవచ్చని అంచనా వేశారు. దీని ప్రభావం దేశ జీడీపీ వృద్ధి, రైతుల ఆదాయాలపై పడే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యంగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, వంటనూనెలు, పత్తి వంటి తక్కువ సాగునీటి వనరులు ఉన్న పంటల ధరలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. రైతులకు ఉపశమనం కల్పించేందుకు పంటల బీమా పథకాలను వేగవంతం చేయాలని, అధిక నీటి అవసరం ఉన్న వరి సాగు కంటే పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించాలని సూచించారు. అలాగే ఖరీఫ్ అనంతరం వచ్చే రబీ సీజన్‌కు జలాశయాల్లో తగినంత నీరు ఉండకపోవచ్చని హెచ్చరించారు. అయితే ప్రస్తుతం దేశంలో బియ్యం, గోధుమల నిల్వలు సమృద్ధిగా ఉండటం ఒక సానుకూల అంశమని, దీంతో ఆహారధాన్యాల ధరలపై ఒత్తిడిని కొంతవరకు నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు.

రైతులకు నిపుణులు సూచన


ఎల్‌నినో ప్రభావం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవడం రైతులకు కీలకంగా మారనుంది. రైతులు కూడా వాతావరణ సూచనలను గమనిస్తూ పంటల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.