Reading Time: < 1 minute
Cinema Chiranjeevi Exhibitors Meeting Peddi Movie Ticket Prices

Megastar Chiranjeevi: టాలీవుడ్‌లో గత కొంతకాలంగా ఎగ్జిబిటర్లు – నిర్మాతల మధ్య నడుస్తున్న పర్సంటేజ్ వివాదానికి ఎట్టకేలకు తెరపడినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన కీలక చర్చలు సఫలమయ్యాయని సమాచారం. రెండు రోజుల వ్యవధిలోనే మెగాస్టార్‌తో ఎగ్జిబిటర్లు రెండోసారి ప్రత్యేకంగా సమావేశమై ఈ సమస్యకు ఒక సామరస్యపూర్వక ముగింపుని పలికారని సమాచారం. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ అధికారికంగా ఒక ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది.

మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ సినిమాకు సంబంధించి ఏపీలో టికెట్ల ధరలు పెరిగినట్లయితే.. దానికిగానూ 7.5 శాతం మొత్తాన్ని చెల్లించాలని ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య తాజాగా ఒప్పందం కుదిరింది. నిర్మాతలకు – థియేటర్ల యాజమాన్యాలకు మధ్య పర్సంటేజ్ షేరింగ్ విషయంలో గత కొన్ని రోజులుగా సందిగ్ధత కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిర్మాతలను – థియేటర్ల యాజమాన్యాలను సమన్వయం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి వరుసగా రెండు రోజులు భేటీలు నిర్వహించి వివాదం ముదిరిపోకుండా చక్కని పరిష్కారం చూపించారని చెబుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవితో ఎగ్జిబిటర్ల భేటీ అనంతరం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామన్స్ సెక్రటరి శ్రీధర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారు మా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన మాటకు కట్టుబడి ఉంటాము. పెద్ద సినిమాలకు టికెట్ రేటు పెంచితే రెంట్‌తో పాటు 7.5 పర్సెంటేజ్ ఇస్తామన్నారు. అలాగే జూన్ 30 లోపు పర్సెంటేజ్ సమస్యకు పరిష్కారం చూపిస్తామని చిరంజీవి గారు హామీ ఇచ్చారు’ అని చెప్పారు.