Reading Time: 2 minutes
Ys Jagan Targets Tdp Government Over Failures Reviews Local Poll Strategy And Sir Issue

YS Jagan: మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ మరియు అసెంబ్లీ కోఆర్డినేటర్లు హాజరయ్యారు. సమావేశంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అంశాలపై జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రజల పక్షాన చేపట్టాల్సిన పోరాటాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు జగన్.

“రెండేళ్ల చంద్రబాబు పాలన మోసపూరితం”
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నాయని, ఈ కాలంలో ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారని విమర్శించారు జగన్‌.. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. “బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ” అని ప్రజల్లో నిరూపితమైందన్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో 143 హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేశారని విమర్శించారు. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా హామీల అమలుపై ఒక్క మాట లేదన్నారు జగన్‌.

“ప్రజలను మభ్యపెట్టే డైవర్షన్ పాలిటిక్స్”
ప్రభుత్వం చేసిన మంచి ఏమీ లేకపోవడంతో ప్రజలను మభ్యపెట్టేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని జగన్ ఆరోపించారు. గొడ్డళ్లు, కత్తులు, కటార్లు అంటూ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం జరుగుతోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు భారీ పన్నులు వేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలపై భారం పెరిగిందని, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

“వెన్నుపోటుకు రెండేళ్లు” బుక్‌లెట్ విడుదల
చంద్రబాబు పాలనలో జరిగిన మోసాలు, వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో ప్రత్యేక బుక్‌లెట్ విడుదల చేస్తున్నట్లు జగన్ తెలిపారు. ఈ బుక్‌లెట్‌ను క్యూ ఆర్ కోడ్ రూపంలో పార్టీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. గ్రామ స్థాయి వరకు ప్రజలకు పంపిణీ చేసి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని పార్టీ నేతలకు సూచించారు.

జూన్ 4 నుంచి రాష్ట్రవ్యాప్త నిరసనలు
జూన్ 4 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జగన్ ప్రకటించారు. జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసనలు, జూన్ 8న నియోజకవర్గ స్థాయి సదస్సులు, జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మేనిఫెస్టో దహనం కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజలకు ఇచ్చిన బాండ్ల కాపీలు పంపిణీ చేస్తూ ప్రభుత్వం హామీలను ఎలా విస్మరించిందో వివరించాలని సూచించారు జగన్‌.

స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ఆదేశాలు
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని జగన్ స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉండాలని, విజయాపజయాలకు అతీతంగా పోటీ చేసిన వారిని ప్రోత్సహించాలని అన్నారు. ఎక్కడైనా ఏకగ్రీవ ఎన్నికలు జరిగితే దాన్ని సీరియస్‌గా తీసుకుంటానని హెచ్చరించారు. గ్రామ స్థాయిలో కమిటీలను యాక్టివ్ చేసి సరైన అభ్యర్థులను ఇప్పటి నుంచే ఎంపిక చేయాలని సూచించారు జగన్‌.

SIRపై అప్రమత్తంగా ఉండాలని సూచన
ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అంశంపై జగన్ ప్రత్యేకంగా నేతలను అప్రమత్తం చేశారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో భారీ సంఖ్యలో ఓట్లు తొలగించారని ఉదాహరణలు చెబుతూ, పార్టీ ఓటర్లను కాపాడుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో పార్టీ అనుకూల ఓటర్ల జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలని, ఒక్కో గ్రామంలో 50 ఓట్లు తొలగించినా నియోజకవర్గ స్థాయిలో వేల ఓట్ల నష్టం జరుగుతుందని హెచ్చరించారు. కుప్పంలో టీడీపీకి అనుకూలంగా భారీ సంఖ్యలో బోగస్ ఓట్లు ఉన్నాయని ఆరోపిస్తూ, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉంటేనే ఓటర్లను కాపాడుకోగలమన్నారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్..