Reading Time: < 1 minute
Supreme Court Petition Demands Abolition Of Nta After Neet Ug 2026 Paper Leak Crisis

నీట్ పేపర్ లీక్ కుంభకోణం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. NTAను రద్దు చేయాలని కోరుతూ యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 1860 సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం కింద స్థాపించబడిన ప్రస్తుత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి, పార్లమెంట్ చట్టం ద్వారా ఒక కొత్త చట్టబద్ధమైన జాతీయ పరీక్షా సంస్థను ఏర్పాటు చేయాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

స్పష్టమైన చట్టపరమైన అధికారం, కఠినమైన పారదర్శక నియమాలు, పార్లమెంటుకు ప్రత్యక్ష జవాబుదారీతనం కలిగిన ఒక కొత్త జాతీయ పరీక్షా సంస్థను ఏర్పాటు చేసేందుకు పార్లమెంటులో చట్టాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈ పిటిషన్ కోరుతోంది. దేశంలోనే అతిపెద్ద పరీక్షలను నిర్వహించే ఈ సంస్థకు పటిష్టమైన చట్టపరమైన వ్యవస్థ, జవాబుదారీతనం ఉండాలని పిటిషనర్లు వాదిస్తున్నారు. నీట్ పేపర్ లీక్‌పై దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్న తరుణంలో ఈ పిటిషన్ దాఖలైంది.

నీట్ కేసులో సూత్రధారిగా భావిస్తున్న లెక్చరర్ పీవీ కులకర్ణిని విచారించగా కీలక సమాచారం వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తు సంస్థల ప్రకారం, ఈ మొత్తం నెట్‌వర్క్‌లో పీవీ కులకర్ణితో పాటు ఇతర వ్యక్తులు కూడా కీలక పాత్ర పోషించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పీవీ కులకర్ణి, మనీషా వాఘ్మారేలతో పాటు మరో ఇద్దరు లెక్చరర్లు కూడా ప్రశ్నపత్రం లీక్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. వీరిద్దరి కోసం సీబీఐ పూణే, లాతూర్‌లలో సోదాలు చేపట్టింది. ఈ ఇద్దరు లెక్చరర్లు ఎన్‌టీఏతో కలిసి నీట్ పరీక్ష నిర్వహణలో పాలుపంచుకున్నారని, పీవీ కులకర్ణితో సన్నిహితంగా పనిచేస్తున్నారని కూడా దర్యాప్తులో వెల్లడైంది.