
భూగోళంపై జీవించే ప్రతి జీవికి ఏదో ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. అలాగే ఏడాది లో కేవలం ఒకే సారి పూసే అరుదైన మొక్క ఒకటి ఉంది. ఆ మొక్క పుష్పాలు కేవలం మే నెలలోనే వికసించి అందరినీ ఆకట్టుకుంటాయి. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణానికి చెందిన వార్ల మల్లేశం అనే ఉపాధ్యాయుడి టెర్రస్ గార్డెన్ లో ఈ అరుదైన దృశ్యం దర్శనమిచ్చింది. సంవత్సరంలో కేవలం మే మాసంలో ఒక్కసారి మాత్రమే పూసే స్కాడోక్సస్ మల్టీఫ్లోరస్ @ పుట్బాల్ లిల్లీ వికసించింది. ఈ మొక్క వృక్షరాజ్యంలోని అమరిల్లిడేసి కుటుంబానికి చెందిది. ఈ దుంపకాండ మొక్క శాస్త్రీయ నామం స్కాడోక్సస్ మల్టీఫ్లోరస్ కాగా భారత దేశంలో ఈ మొక్కను పుట్బాల్ లిల్లీ, బ్లడ్ లిల్లీ అనే పేర్లతో పిలుస్తుంటారు. బ్రిటిష్ కాలం నాటి నుండి ఈ మొక్క ఉనికి దేశంలో ఉంది.
ఇక ఆంధ్రప్రదేశ్ లోని పాడేరు నుండి ఆసక్తి తో పదేళ్ల క్రితం ఈ మొక్క దుంపను తెచ్చి కుండీలో నాటారు మల్లేశం. ప్రతి ఏటా మే నెలలో ఒక్క పువ్వు మాత్రమే వచ్చేదని గత ఏడాది నాలుగు పుష్పాలు పూయగా, ఇప్పుడు అయిదు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. జూన్ నెల వరకు ఈ పుష్పాలు ఉంటాయని ఆ తరువాత అవి రాలి పోతాయి. ఆ తర్వాత వచ్చిన ఆకులు జనవరి వరకు మాత్రమే ఉండి ఎండిపోతాయి. కేవలం దుంప మాత్రమే మట్టిలో దాగి ఉండి మే నెలలో మొగ్గలు తోడిగి పువ్వులు వస్తాయని, అందుకే మే పుష్పం అని పిలుస్తారని మల్లేశం చెప్పారు. ఒక్క సారి దుంప నేలలో పాతితే ఈ మొక్కకు మరణం ఉండకపోవడం విశేషం.
ఇక మల్లేశం ఇంట్లో ఫుట్ బాల్ లిల్లీ వికసించిన సమాచారం తెలుసుకొని కోస్గి పట్టణ వాసులు చూసేందుకు క్యూ కట్టారు. అరుదైన పుష్పాన్ని చూసి అందరూ ముచ్చటపడుతున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన ‘లిల్లీ’ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.