Reading Time: < 1 minute
Hyderabad: సొంతింటికే నిప్పు పెట్టాడు.. అక్కడే కుర్చీ వేసుకొని కూర్చుకున్నాడు..  ఎందుకో తెలిస్తే..

హైదరాబాద్‌లోని యాకుత్‌పురా రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముర్తుజా చమన్ ప్రాంతంలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఓ వ్యక్తి ఆవేశంతో తన సొంత ఇంటికే నిప్పు పెట్టుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆ ప్రాంతంలో ‘బాబా’గా పిలవబడే అస్లాం అనే వ్యక్తి అర్ధరాత్రి తన సొంత ఇంటికి నిప్పంటించాడు. ఇందులో మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నిప్పు పెట్టిన అనంతరం ఆ వ్యక్తి అక్కడి నుండి ఎక్కడికీ పారిపోకుండా ఇంటి ముందే కుర్చీ వేసుకుని చాలా నింపాదిగా కూర్చున్నాడు.

కళ్ల ముందే ఇల్లు తగలబడుతున్న దృశ్యాన్ని చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయినా అస్లాంలో ఎలాంటి చలనం లేకపోవడం వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మంటల వ్యాప్తి మరింత తీవ్రమవుతుండడం గమనించిన ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం స్థానిక కార్పొరేటర్ వాసా ఉద్దీన్ వరకు చేరడంతో ఆయన అప్రమత్తమై పోలీసు ఉన్నతాధికారులు, DRF బృందానికి సమాచారం అందించాడు. దీంతొ వెంటనే వారు ఘటనా స్థలానికి పెద్దఎత్తున చెలరేగుతున్న మంటలను ఆర్పివేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిప్పు పెట్టిన సమయంలో ఆ ఇంట్లో మరెవరూ లేనట్లు తెలుస్తోంది.

అయితే.. గత కొంతకాలంగా అస్లాం ప్రవర్తనతో మార్పులు వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. అస్లాం వల్ల కుటుంబ సభ్యులతో పాటు కాలనీ ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అతని విచిత్ర చర్యల వల్ల మొత్తం ప్రాంతానికే ప్రమాదం పొంచి ఉందని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇలాంటి చర్యల వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక, భయం భయంగా బతుకుతున్నామని.. ఈ ప్రాంతంలో నివసించాలంటేనే కష్టంగా ఉందని వాపోతున్నారు. అధికారులు స్పందించి అస్లాంపై కఠిన చర్యలు తీసుకుని, ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.