
మలయాళం సినీ ఇండస్ట్రీలో మమ్ముట్టి, మోహన్ లార్ పేర్లు వింటే చాలు ఫ్యాన్స్ లో పూనకాలు వచ్చేస్తాయి. వీరిద్దరూ కలిసి వెండితెరపై కన్పించి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తోంది. 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు వీరిద్దరూ మహేష్ నారాయణన్ దర్శకత్వంలో ‘పేట్రియాట్’ మూవీలో నటించి అభిమానుల నిరీక్షణకు తెరదించారు. భారీ అంచనాలతో ఈ మూవీ ఈ రోజు ( మే 1, 2026న) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. గూఢచర్యం, డిజిటల్ నిఘా నేపథ్యంలో సాగే ఈ స్పై థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం…
కథా నేపథ్యం
డిఫెన్స్ రీసెర్చ్ వింగ్‌లో రీసెర్చ్ సైంటిస్ట్‌గా పనిచేసే డాక్టర్ డేనియల్ జోసెఫ్ (మమ్ముట్టి), ప్రభుత్వం పంపిణీ చేసే పరికరాల ద్వారా ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి నిఘా ప్రవేశిస్తోందని గుర్తిస్తాడు. మంత్రి సుందరం (రాజీవ్ మీనన్) కుమారుడు శక్తి సుందరం (ఫహద్ ఫాసిల్) పేద విద్యార్థులకు పంపిణీ చేసే ల్యాప్‌టాప్‌లలో ‘పెరిస్కోప్’ అనే స్పైవేర్ ఉందని తెలుసుకున్న డేనియల్, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అతడిని దేశద్రోహిగా ముద్ర వేయడంతో ప్రాణరక్షణ కోసం లండన్ పారిపోతాడు. అక్కడ అతనికి తన పాత మిత్రుడు కల్నల్ రహీమ్ సాహెబ్ (మోహన్‌లాల్) తోడవుతాడు. వీరిద్దరూ కలిసి ఈ భారీ కుట్రను ఎలా ఛేదించారు? దేశ భద్రతను ఎలా కాపాడారు? అన్నదే మిగతా కథ.
ఎవరెవరు ఎలా చేశారంటే?
సినిమాకు ప్రధాన బలం మమ్ముట్టి. ఒక నిస్సహాయుడైన శాస్త్రవేత్తగా, అదే సమయంలో వ్యవస్థపై పోరాడే వీరుడిగా ఆయన నటన అద్భుతం. ముఖ్యంగా మొదటి సగంలో తన అనుభవంతో సినిమాను భుజాలపై మోశారు. సెకండ్ ఆఫ్ లో ఎంట్రీ ఇచ్చే కల్నల్ రహీమ్ పాత్రలో మోహన్‌లాల్ తనదైన శైలిలో మెప్పించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, మమ్ముట్టితో కలిసి ఉన్న సీన్స్ ఫ్యాన్స్‌కు ఐ-ఫీస్ట్ అని చెప్పాలి. ప్రతినాయకుడిగా ఫహద్ నటన సెటిల్డ్‌గా ఉన్నప్పటికీ, ఆయన పాత్రకు బలమైన ఆర్క్ లేకపోవడం కొంత నిరాశ కలిగిస్తుందని ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. ఇక నయనతార పాత్ర పరిమితమే అయినా ఉన్నంతలో బాగానే చేసింది. కుంచాకో బోబన్ తన రేంజ్‌ను దాటి ప్రయోగాత్మక పాత్రలో రాణించారు.
ప్లన్, మైనస్ ఇవే..
దర్శకుడు మహేష్ నారాయణన్ ఎంచుకున్న పాయింట్ చాలా సీరియస్ అండ్ కంటెంపరరీ. డిజిటల్ నిఘా ఎంత ప్రమాదకరమో ఆయన చక్కగా చూపించారు. మనుష్ నందన్ సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సుశిన్ శ్యామ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్లను ఎలివేట్ చేసినా, ఆయన గత చిత్రాలతో పోలిస్తే పాటలు అంతగా గుర్తుండిపోవు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే బాగుండేది అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాకు ప్రధాన బలం మమ్ముట్టి – మోహన్‌లాల్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. అంతే కాకుండా సమకాలీన డిజిటల్ నిఘా నేపథ్యంలో కథ ఆకట్టుకుంటుంది. హై ప్రొడక్షన్ వాల్యూస్ మరింత పెంచింది. అయితే సెకండ్ ఆఫ్ కథ కాస్త నెమ్మదించిందన్న టాక్ వినిపిస్తోంది. ఎమోషనల్ బాండింగ్ బలహీమైనది , ప్రిడిక్టబుల్‌గా అనిపించే కొన్ని సీన్లు ఉన్నాయని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు..
‘పేట్రియాట్’ ఒక కమర్షియల్ మసాలా సినిమా కాదు; ఇదొక కంటెంట్ ఓరియెంటెడ్ స్పై థ్రిల్లర్. స్టార్డం కంటే కథకే ప్రాధాన్యతనిస్తూ తీసిన ఈ చిత్రం, కొన్ని నెమ్మదైన సీన్లు ఉన్నప్పటికీ.. కేవలం ఆ ఇద్దరు లెజెండ్స్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూడటం కోసమైనా తప్పక చూడదగ్గ చిత్రం అని ఫ్యాన్స్ అంటున్నారు. స్లో పేస్డ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఇది బాగా నచ్చుతుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ లెజెండ్స్ మూవీ ఎలాంటి కలెక్షన్స్ రికార్డు సృష్టిస్తుందో చూడాలి.