
ఢాకా: 2026 ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా అతిథ్యమిచ్చిన టీ20 వరల్డ్ కప్‌ను బంగ్లాదేశ్ బాయ్ కాట్ చేసిన విషయం తెలిసిందే. రాజకీయ, ఇతర కారణాలతో టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు అప్పటి బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా ఈ అంశంపై బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
2026 టీ20 వరల్డ్ కప్ నుంచి వైదొలగడం బంగ్లాదేశ్‌కు భారీ నష్టమని పేర్కొన్నారు. బంగ్లా టీ20 వరల్డ్ కప్‌కు దూరం కావడానికి కారణం మహ్మద్ యూనస్ నేతృత్వంలోని అప్పటి తాత్కాలిక ప్రభుత్వమేనని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రతిష్టాత్మక టీ20 టోర్నీలో తమ దేశ ఆటగాళ్లను చూడాలని బంగ్లాదేశ్ అభిమానులు ఎంతగానో కోరుకున్నారని.. ప్రభుత్వ పొరపాటు వల్ల అభిమానుల ఆశలు నాశమనమయ్యాయని అన్నారు.
‘‘2026 టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనకపోవడం బంగ్లాదేశ్ క్రికెట్‌కు పెద్ద నష్టం. ఒక దేశంగా మన ఆటగాళ్లు ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడటం చూడటాన్ని మనం ఎంతో ఇష్టపడతాం. మనది క్రికెట్‌ను అమితంగా ప్రేమించే దేశం. బంగ్లాదేశ్ లాంటి దేశం ప్రపంచ కప్‌లో పాల్గొనకపోవడం చాలా పెద్ద లోటు. ప్రపంచ కప్‌లో పాల్గొనకూడదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద పొరపాటు’’ అని షకీబ్ పేర్కొన్నాడు.
అసలేం జరిగిందంటే..?
అప్పట్లో ఇండియాతో నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇండియాలో పర్యటించలేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి తేల్చిచెప్పింది. తమ మ్యాచులను ఇండియాలో కాకుండా తటస్థ వేదికల్లో నిర్వహించాలని కోరింది. లేదంటే తమ జట్టును గ్రూప్-సి నుంచి గ్రూప్-బికి మార్చాలని మరో ప్రతిపాదన తీసుకొచ్చింది. అయితే.. అప్పటికే టోర్నీ షెడ్యూల్ ఫిక్స్ కావడంతో బీసీబీ అభ్యర్థనలను ఐసీసీ తిరస్కరించింది. ఇండియాలో ఆడాల్సిందేనని.. లేదంటే టోర్నీ నుంచి తప్పుకోవాలని ఐసీసీ అల్టిమేటం జారీ చేసింది. దీంతో ఇండియాలో ఆడేందుకు ఇష్టపడని బంగ్లాదేశ్ వరల్డ్ కప్ టోర్నీ నుంచి తప్పుకుంది.