
కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలను ఘనం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. మే21 నుంచి 12రోజుల పాటు పుష్కరాలను నిర్వహించనుంది. పుష్కరాలకు 30.63కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టింది. ఈ పుష్కరాలకు దాదాపు 30 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని .. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. బుధవారం (ఏప్రిల్ 29)మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సరస్వతీ అంత్య పుష్కరాల పోస్టర్, అధికారిక టీజర్ ను ఆవిష్కరించారు మంత్రి కొండా సురేఖ.
సరస్వతీ అంత్య పుష్కరాలను మే 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజులపాటు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. దాదాపు 30 లక్షల మంది భక్తులు పుష్కరాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రశాంత వాతావరణంలో భక్తులు పుష్కర స్నానం, స్వామి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరస్వతి ఆది పుష్కరాలు, సమ్మక్కసారలమ్ జాతర అత్యంత వైభవంగా నిర్వహించామని మంత్రి చెప్పారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహించేందుకు పనులు ప్రారంభించామని మంత్రి కొండా సురేఖ చెప్పారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సరస్వతి పుష్కరాల పనులను పది రోజులకు ముందే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ యంత్రాంగం , ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పుష్కరాలను విజయవంతం చేయాలని కోరారు. కాళేశ్వరం దేవస్థానం పునర్నిర్మాణానికి రూ. 198 కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ణతలు తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు.