
అబుదాబి: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ప్రపంచ ఇంధన మార్కెట్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ ప్రధాన చమురు ఉత్పత్తి కూటములైన ఒపెక్, ఒపెక్+ నుంచి వైదొలగుతున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సంచలన ప్రకటన చేసింది. 2026, మే 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ మేరకు యూఏఈ ప్రభుత్వ వార్తా సంస్థ వామ్ మంగళవారం (ఏప్రిల్ 27) ఒక ప్రకటన విడుదల చేసింది. యూఏఈ దీర్ఘకాలిక ఆర్థిక, ఇంధన వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ చర్య చమురు ఉత్పత్తి, రవాణాను స్వతంత్రంగా నిర్వహించుకోవడానికి యూఏఈకి మరింత వెసులుబాటును కల్పిస్తుందని పేర్కొంది.
అలాగే చమురు, గ్యాస్, తక్కువ-కార్బన్ ఇంధన రంగాలలో విదేశీ పెట్టుబడులను వేగవంతం చేయగలమని యూఏఈ పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో ప్రపంచవాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచ ప్రధాన చమురు ఉత్పత్తి కూటములైన ఒపెక్, ఒపెక్+ నుంచి వైదొలగుతున్నట్లు యూఏఈ చేసిన ప్రకటన గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. యూఏఈ నిర్ణయంతో ఒపెక్, ఒపెక్+ కూటముల ఐక్యత బలహీనపడుతుందని.. ఇది కూటమికి పెద్ద ఎదురుదెబ్బ అంటున్నారు విశ్లేషకులు.
ఒపెక్ కూటమి:
ప్రపంచ చమురు మార్కెట్‌ను సమిష్టిగా నియంత్రించడమే లక్ష్యంగా 1960లో ఒపెక్ (Organization of the Petroleum Exporting Countries) కూటమి ఏర్పాటైంది. ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులా ఐదు వ్యవస్థాపక దేశాలు. ప్రస్తుతం ఒపెక్ కూటమిలో 12 సభ్య దేశాలు (అల్జీరియా, కాంగో, ఈక్వటోరియల్ గినియా, గాబన్, ఇరాన్, ఇరాక్, కువైట్, లిబియా, నైజీరియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వెనిజులా ) ఉన్నాయి.
ఒపెక్+ కూటమి:
ఒపెక్ కూటమికి కొనసాగింపుగా 2016లో ఒపెక్+ కూటమి ఏర్పడింది. ఒపెక్+లో ప్రస్తుతం 22 దేశాలు ఉన్నాయి. వీటిలో 12 ప్రధాన ఒపెక్ సభ్య దేశాలు కాగా రష్యాతో సహా 10 ఒపెక్-యేతర చమురు ఉత్పత్తి మిత్రదేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. ప్రపంచ చమురు సరఫరా, ధరలను నియంత్రించడమే ఒపెక్+ కూటమి ప్రధాన లక్ష్యం.
యూఏఈ నిష్క్రమణతో ఒపెక్ కూటమికి బీటలు..!
ఒపెక్, ఒపెక్+.. సింపుల్‌గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రపంచంలో చమురు ఉత్పత్తి, రవాణా చేసే ప్రధాన దేశాల కూటమి. ఈ కూటమిలోని దేశాలే ప్రపంచ ఇంధన మార్కెట్‌ను శాసిస్తాయి. చమురు ఉత్పత్తి, రవాణా, ధరలను నియంత్రిస్తుంటాయి. సభ్య దేశాలన్ని కూటమి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఒపెక్, ఒపెక్+ కూటమిలో యూఏఈ దేశానిది కీలక పాత్ర. అమెరికా, ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో చమురు ఉత్పత్తి, రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
గల్ప్ దేశాల నుంచి చమురు రవాణా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. మరోవైపు అమెరికా ఇరాన్ వెనక్కి తగ్గకపోవడంతో శాంతి ఒప్పందం ఇప్పట్లో కుదిరే అవకాశం కనిపించడం లేదు. ఇక, ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులను కంటిన్యూ చేస్తుండటంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఒపెక్, ఒపెక్+ కూటముల నుంచి వైదొలగాలని యూఏఈ నిర్ణయించుకుంది. కూటమిలో భాగస్వామిగా లేకపోవడంతో యూఏఈపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఇకపై తమ చమురు ఉత్పత్తి, రవాణా, ధరల విషయంలో స్వతంత్రంగా వ్యవహరించవచ్చు.
తమ ఇంధనాన్ని తమకు నచ్చిన ధరకు, తమకు నచ్చిన వినియోగదారులకు అమ్ముకోవచ్చు. ప్రపంచ ఇంధన మార్కెట్లలో తీవ్ర అస్థిరత నెలకొన్న వేళ యూఏఈ వైదొలగడం ఒపెక్+ భవిష్యత్ సమైక్యతపైనా, సామర్థ్యంపైనా ప్రశ్నలను లేవనెత్తుతోంది. యూఏఈ నిష్క్రమణ చమురు సరఫరాలో ఏర్పడే ఆకస్మిక మార్పులను నిర్వహించడంలో ధరల క్రమశిక్షణను పాటించడంలో కూటమి సామర్థ్యాన్ని నిర్మాణాత్మకంగా బలహీనపరచవచ్చు.