Reading Time: 2 minutes
Abhishek Sharma Faces Awkward Fan Incident In Ipl 2026 Viral Video Sparks Debate On Boundaries

Abhishek Sharma Lady Fan Incident: సాధారణంగా సెలబ్రిటీలను చూడగానే సెల్ఫీలు లేదా ఆటోగ్రాఫ్‌ల కోసం అభిమానులు ఎగబడటం ఈరోజుల్లో సహజం. అయితే కొందరు ఫాన్స్ హద్దు మీరడంతో సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే టీమిండియా యువ సంచలనం, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఓపెనర్ అభిషేక్ శర్మకు ఎదురైంది. హోటల్ ప్రాంగణంలో అభిషేక్ శర్మకు ఎదురైన ఒక సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.

ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో రాయల్స్‌ను సన్‌రైజర్స్‌ చిత్తు చేసింది. ఈ మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ తన హోటల్ గదికి వెళ్తున్న సమయంలో ఒక మహిళా అభిమాని ఉత్సాహంతో ఒక్కసారిగా అతడి చేతి పట్టుకొని లాగింది. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ.. అమ్మాయి చేతి నుంచి అభిషేక్‌ను విడిపించారు. అమ్మాయి చేయి పట్టుకోవడంతో అభిషేక్ తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ ఘటనపై నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ‘ఒకవేళ ఇదే పనిని ఒక పురుష అభిమాని.. మహిళా క్రికెటర్ పట్ల చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది?. ఇప్పటికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యేవి కదా?’ అని ఒక నెటిజన్ ప్రశ్నించారు. ‘సదరు యువతితో పాటు ఆమె ప్రియుడు కూడా అక్కడే ఉండటం గమనార్హం. తన భాగస్వామి మరొకరి పట్ల అలా ప్రవర్తిస్తుంటే అతను ఎంత ఇబ్బంది పడి ఉంటాడో’ అని మరికొందరు జాలి చూపిస్తున్నారు. ‘అభిమానం ఉండాలి, కానీ అది అవతలి వ్యక్తిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. క్రీడాకారులకు కూడా వ్యక్తిగత గౌరవం ఉంటుందని గుర్తించాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.