
ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో పలు కీలక రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించడమే కాకుండా, ఐపీఎల్ చరిత్రలో కొన్ని అరుదైన మైలురాళ్లను కూడా అందుకుంది. ఆర్సబీ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హెజల్‌వుడ్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో పాపం డీసీ బ్యాటర్లు క్రీజ్‌లో నిలబడలేకపోయారు. కేవలం 9 పరుగులకే డీసీ తొలి 6 వికెట్లను కోల్పోయింది. ఈ దెబ్బతో ఆర్సీబీపై ఉన్న 49 పరుగులకు ఆలౌట్ మచ్చ తొలగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, అది జరగలేదు. ఆ విషయం పక్కనపెడితే ఈ మ్యాచ్‌లో బ్రేక్ అయిన రికార్డులేంటో ఇప్పుడు చూద్దాం..
విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలోనే 9,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకోవడానికి అతనికి ఈ మ్యాచ్‌లో కేవలం 11 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. వాటిని పూర్తి చేసి 15 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సులతో 23 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప పవర్‌ప్లే స్కోరు
ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‌లో ఒక చెత్త రికార్డును మూటగట్టుకుంది. పవర్‌ప్లే ముగిసే సమయానికి ఢిల్లీ 6 వికెట్ల నష్టానికి కేవలం 13 పరుగులు మాత్రమే చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప పవర్‌ప్లే స్కోరు.
పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు
పవర్‌ప్లే (మొదటి 6 ఓవర్లు) లోనే ఢిల్లీ 6 వికెట్లు కోల్పోయింది. ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్ పవర్‌ప్లేలో ఇన్ని వికెట్లు కోల్పోవడం ఇదే మొదటిసారి. అంతకుముందు 2022లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్లు కోల్పోవడమే రికార్డుగా ఉండేది.
అత్యంత వేగవంతమైన విజయాల్లో ఒకటి
ఢిల్లీని కేవలం 75 పరుగులకే ఆలౌట్ చేసిన బెంగళూరు, ఆ లక్ష్యాన్ని కేవలం 6.3 ఓవర్లలోనే ఛేదించింది. ఇది ఐపీఎల్ చరిత్రలో (బంతుల పరంగా) రెండో అతిపెద్ద విజయం. బెంగళూరు ఇంకా 81 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.
ఈ సీజన్‌లో అత్యల్ప జట్టు స్కోరు
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన 75 పరుగులు ఇప్పటి వరకు నమోదైన అత్యల్ప స్కోరు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ 3.3 ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. అలాగే భువనేశ్వర్ కుమార్ కేవలం 5 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి