Reading Time: 2 minutes
MS Dhoni  : ఫిట్‌గా ఉన్నా ఆడనంటున్నాడు… సీఎస్కే మేనేజ్మెంట్‌కు క్లారిటీ ఇచ్చిన ధోనీ.. వారి కోసం ఇంత త్యాగమా ?

MS Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు ఇది మింగుడుపడని వార్తే. ఐపీఎల్ 2026 సీజన్ మొదలై నెల రోజులు గడుస్తున్నా, ఎంఎస్ ధోనీ ఇంకా మైదానంలోకి అడుగుపెట్టలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ధోనీ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించినప్పటికీ, తుది జట్టులోకి రావడానికి మాత్రం విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. యువ ఆటగాళ్ల అవకాశాలను దెబ్బతీయడం ఇష్టం లేకనే తలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే ధోనీకి పిక్క గాయం కావడంతో మొదటి రెండు వారాలు అందుబాటులో ఉండడని టీమ్ మేనేజ్మెంట్ తెలిపింది. కానీ టోర్నీ మొదలై నెల రోజులవుతున్నా ధోనీ ఇంకా ప్లేయింగ్ ఎలెవన్ లో కనిపించలేదు. అతను జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటున్నాడు కానీ, మ్యాచ్ రోజు మాత్రం స్టేడియానికి రావడం లేదని రిపోర్టులు చెబుతున్నాయి. ధోనీ లేకపోవడంతో చెన్నై అభిమానులు నిరాశలో మునిగిపోయారు.

యువ ఆటగాళ్ల కోసమేనా?

తాజా సమాచారం ప్రకారం.. ధోనీ తన రీఎంట్రీ వల్ల జట్టు కాంబినేషన్ దెబ్బతింటుందని భావిస్తున్నాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న యంగ్ ప్లేయర్ను తొలగించి తాను రావడం అతనికి ఇష్టం లేదట. ఇదే విషయాన్ని అతను మేనేజ్మెంట్ కు కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వికెట్ కీపింగ్ బాధ్యతలను సంజూ శాంసన్ అద్భుతంగా నిర్వర్తిస్తుండటంతో, తానొచ్చి ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సిన అవసరం లేదని ధోనీ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

కోచ్ ఫ్లెమింగ్ ఏమన్నారంటే?

గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు ముందు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను ధోనీ గురించి అడగగా, ఆయన చాలా ఆచి తూచి స్పందించారు. “ధోనీ కోలుకుంటున్నాడు, అతని రికవరీ బాగుంది” అని మాత్రమే చెప్పారు. మరోవైపు బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ మాట్లాడుతూ.. ఒకవేళ ధోనీ జట్టులోకి వస్తే ఖచ్చితంగా వికెట్ కీపింగ్ చేస్తాడని, ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చే అవకాశం లేదని ముందే స్పష్టం చేశారు. కేవలం రన్నింగ్ చేసేటప్పుడు గాయం ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలని ఆయన అన్నారు.

పాయింట్ల పట్టికలో చెన్నై పరిస్థితి

ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచి 6 పాయింట్లతో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే రాబోయే మ్యాచ్‌ల్లో విజయం తప్పనిసరి. ఇలాంటి క్లిష్ట సమయంలో ధోనీ వంటి అనుభవజ్ఞుడి అవసరం జట్టుకు చాలా ఉంది. మరి అభిమానుల కోరిక మేరకు ధోనీ తన మనసు మార్చుకుని మైదానంలోకి అడుగుపెడతాడా లేక మెంటార్ గానే ఉండిపోతాడా అన్నది చూడాలి.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి