
Rava Paratha Recipe: ఉరుకులు పరుగుల జీవితంలో.. కొన్నిసార్లు ఫుడ్‌కు కూడా తగిన సమయం కేటాయించడం లేదు.. ఒకే రకమైన ఫుడ్‌కు అలవాటు పడిపోతున్నారు.. బోర్‌గా ఫీల్ అవుతున్నారు.. అయితే, ప్రతిరోజూ ఒకే రకమైన అల్పాహారం తింటూ విసుగెత్తిపోయారా? పోహా, ఉప్మా, శాండ్‌విచ్, పరాఠాలు లాంటి సాధారణ బ్రేక్‌ఫాస్ట్‌కు బదులుగా ఈరోజు కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే రవ్వ పరాఠాలు మంచి ఎంపిక. ఇవి తక్కువ సమయంలో సిద్ధమవుతాయి, తినడానికి ఎంతో రుచిగా ఉంటాయి, జీర్ణం కావడానికి కూడా సులభంగా ఉంటాయి. ముఖ్యంగా ఉదయం తొందరలో ఉన్నప్పుడు కేవలం 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. రవ్వతో చేసే ఈ పరాఠాల ప్రత్యేకత వాటి మెత్తదనం. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని ఇష్టంగా తింటారు. వేడి టీతో, చల్లని పెరుగుతో లేదా ఇష్టమైన పచ్చడితో కలిపి తింటే మరింత రుచిగా ఉంటాయి.
రవ్వ పరాఠాలు ఎందుకు ప్రత్యేకం?
బొంబాయి రవ్వ కడుపుకు తేలికగా ఉండటంతో త్వరగా జీర్ణమవుతుంది. ఇందులో కలిపే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, వాము వంటి పదార్థాలు రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచివి. తక్కువ సమయంలో రుచికరమైన అల్పాహారం కావాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్.
కావలసిన పదార్థాలు:
* 2 కప్పుల బొంబాయి రవ్వ
* ½ కప్పు గోధుమ పిండి
* ½ ఉల్లిపాయ (సన్నగా తరిగినది)
* ½ టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్
* 1-2 పచ్చిమిర్చి (సన్నగా తరిగినవి)
* కొద్దిగా కొత్తిమీర
* ½ టీస్పూన్ జీలకర్ర
* ½ టీస్పూన్ వాము
* రుచికి సరిపడా ఉప్పు
* కొద్దిగా కాశ్మీరీ మిరప పొడి
* 1 టీస్పూన్ నూనె
* అవసరమైనంత గోరువెచ్చని నీరు
తయారీ విధానం:
ముందుగా రవ్వ గరుకుగా ఉంటే మిక్సీలో ఒకసారి తిప్పి కొద్దిగా మెత్తగా చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో రవ్వ, గోధుమపిండి వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, వాము, ఉప్పు, మిరపపొడి వేసి కలపాలి. ఆపై కొద్దిగా నూనె వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి. తర్వాత గోరువెచ్చని నీటితో మెత్తటి పిండి ముద్దలా కలిపి 10 నుంచి 15 నిమిషాలు మూతపెట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు పిండి నుంచి చిన్న ముద్దలు తీసుకుని పరాఠాల్లా వత్తాలి. వేడి పెనంపై నూనె లేదా నెయ్యి రాసి రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చాలి.
సర్వ్ చేయండి ఇలా..
ఇప్పుడే మీ రుచికరమైన మెత్తటి రవ్వ పరాఠాలు సిద్ధం. వీటిని పెరుగు, చట్నీ లేదా టీతో తింటే అద్భుతంగా ఉంటాయి. ఈ రోజే ఇంట్లో ట్రై చేసి కొత్త రుచిని ఆస్వాదించండి.