
బాలీవుడ్ నుంచి ప్రపంచ స్థాయి నటిగా ఎదిగిన ప్రియాంక చోప్రా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనే ఆమెకు మరోసారి అంతర్జాతీయ వేదికపై సముచిత గౌరవం దక్కింది. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన ప్రముఖులను సత్కరించే ప్రతిష్టాత్మక సంస్థ ‘గోల్డ్ హౌస్’ (Gold House), ఈ ఏడాది తమ గోల్డ్ గాలాలో ప్రియాంకను ప్రత్యేకంగా గౌరవించబోతోంది.
వివిధ రంగాల్లో రాణిస్తున్న అత్యున్నత ఆసియా ప్రముఖులతో గోల్డ్ హౌస్ ప్రతి ఏటా ‘గోల్డ్ 100’ జాబితాను విడుదల చేస్తుంది. ఈ ఏడాదికి గాను ప్రియాంక చోప్రాను ‘గ్లోబల్ వాన్‌గార్డ్ ఆనర్’ (Global Vanguard Honor) తో సత్కరించనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. వినోద రంగంలో ఆమె సాధించిన విజయాలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఆసియా సంస్కృతిని ప్రతిబింబించడంలో ఆమె పోషిస్తున్న పాత్రను గుర్తిస్తూ ఈ అవార్డును అందజేస్తున్నారు. ఐదవ ఎడిషన్‌గా జరుగుతున్న ఈ గోల్డ్ గాలాను ‘ఎ న్యూ గోల్డ్ వరల్డ్’ (A New Gold World) అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. కావున ఈ వేడుక మే 9, 2026న లాస్ ఏంజిల్స్‌లో అత్యంత వైభవంగా జరగనుంది.