
Washington Hilton Gunfire: అమెరికాలో జరిగిన వైట్ హౌస్ కారస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ కార్యక్రమంలో అకస్మాత్తుగా కాల్పుల శబ్దాలు వినిపించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు JD వాన్స్ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. వాషింగ్టన్ లోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో ఈ కార్యక్రమం జరుగుతుండగా.. ఒక్కసారిగా 7 నుంచి 8 వరకు రౌండ్ల కాల్పుల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో అక్కడ ఉన్న వందలాది మంది అతిథులు టేబుళ్ల కింద దాక్కుంటూ భయంతో గందరగోళానికి గురయ్యారు.
కాల్పుల శబ్దాలు వినిపించిన వెంటనే సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వేగంగా స్పందించి ట్రంప్, మెలానియా ట్రంప్, జేడీ వాన్స్‌లను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. కొద్ది నిమిషాల్లోనే భద్రతా బలగాలు మొత్తం ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుని హోటల్‌ను ఖాళీ చేయించారు. ఈ ఘటనతో మొత్తం భవనం లాక్‌డౌన్ చేయబడగా, నేషనల్ గార్డ్ సిబ్బంది కూడా అక్కడ మోహరించారు. బయట కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఘటన సమయంలో ప్రముఖ జర్నలిస్టులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు ట్రంప్ ప్రసంగం కోసం వేచి ఉన్నారు.
తాజా సమాచారం ప్రకారం.. కాల్పులకు పాల్పడిన అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని సమాచారం. ఈ సంఘటనతో అమెరికాలో భద్రతా వ్యవస్థలపై మరోసారి చర్చ మొదలైంది. ఇంత భారీ భద్రత ఉన్న కార్యక్రమంలో కాల్పులు జరగడం ఆందోళన కలిగించే విషయం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.