Reading Time: 2 minutes
తప్పు మా అమ్మాయివైపే ఉంది.. మా అమ్మాయి డబ్బు తీసుకుంది వాస్తవమే: అషు తండ్రి

పెళ్లి పేరుతో కోట్ల రూపాయల మోసం జరిగిందనే ఆరోపణలతో సినీ నటి, బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి చుట్టూ ఇప్పుడు వివాదం ముదురుతోంది. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ధర్మేంద్ర అనే యువకుడిని నమ్మించి, దాదాపు 9 కోట్ల 85 లక్షల రూపాయల ఆర్థిక మోసానికి పాల్పడ్డారంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అషురెడ్డితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.

బాధితుడు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ మూర్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 2018లో అషురెడ్డితో ధర్మేంద్రకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో, పెళ్లి చేసుకుంటానని నమ్మించి అషురెడ్డి వివిధ రూపాల్లో ధర్మేంద్ర నుంచి భారీగా లబ్ధి పొందింది. 5 కిలోల బంగారం, 3 కోట్ల విలువైన విల్లా కోసం అడ్వాన్స్, లగ్జరీ కార్లు ఇలా మొత్తంగా 9 కోట్ల 83 లక్షల రూపాయలను ధర్మేంద్ర ఆమె కోసం ఖర్చు చేసినట్లు కొన్ని రికార్డ్స్ చూపిస్తున్నారు. ఇరు కుటుంబాలు వేణుస్వామి దగ్గర జాతకాలు కూడా చూపించుకున్నాక, చివరకు అషురెడ్డి పెళ్లికి నిరాకరించిందనేది ఇప్పుడు గొడవంతా.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర తండ్రి మరో విషయం కూడా చెప్పుకొచ్చారు. అషూరెడ్డి తమను రెండుసార్లు మోసం చేసిందని చెబుతున్నారు. పెళ్లి రద్దు చేసుకున్నాక డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తే.. డబ్బులు తిరిగి ఇవ్వలేక పెళ్లి చేసుకుంటానని చెప్పి రెండోసారి కూడా మోసం చేసిందనేది ఆయన ఆరోపణ. అటు అషూరెడ్డి సోదరి దివ్యా రెడ్డికి సైతం ధర్మేంద్ర 50 లక్షలు ఇచ్చాడని అతని తండ్రే చెబుతున్నారు. తన కుమారుడిని హనీట్రాప్ చేసి, డబ్బులు అడిగితే రివర్స్ కేసు పెడతామని అషురెడ్డి బెదిరిస్తోందని బాధితుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కేసులో అత్యంత అనూహ్య మలుపు అషురెడ్డి తండ్రి వెంకట కృష్ణ రెడ్డి చెబుతున్న విషయాలు. తన భార్యే అషురెడ్డిని తప్పుదోవ పట్టించి చెడగొడుతోందని, తల్లి మాటలు వినే అషురెడ్డి ఇలా మారిందని చెబుతున్నారాయన. ధర్మేంద్ర నుంచి అషురెడ్డి డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే, ధర్మేంద్ర కుటుంబానికి కాల్ మనీ మాఫియాతో సంబంధం ఉందని, అతనికి ముందే పెళ్లయిందని తెలిసినా అషురెడ్డి తల్లి ఈ సంబంధాన్ని ప్రోత్సహించిందని ఆయన బాంబు పేల్చారు. ప్రస్తుతం తాను వారితో కలిసి ఉండటం లేదని, కూతురు చేసిన తప్పుకు తాను శిక్ష అనుభవించడానికి లేదా జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమేనని కామెంట్ చేయడం షాకింగ్‌గా ఉంది.



మరోవైపు, ఇవన్నీ ఆధారాలు లేని ఆరోపణలేనంటున్నారు అషురెడ్డి. తనపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అటు పోలీసులు మాత్రం BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి పేరుతో జరిగిన ఈ భారీ ఆర్థిక లావాదేవీల వెనుక అసలు నిజానిజాలు ఏమిటన్నది ఇప్పుడు పోలీస్ విచారణలో తేలాల్సి ఉంది.

ఈయన ధరించిన RADO వాచ్ ధర 1981లో రూ.2 వేలు.. ఇప్పుడు ఎన్ని లక్షలంటే..