July 16, 2026

Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?

Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
Reading Time: < 1 minute
Fuel Shortage Telangana Andhra Pradesh Third Day Diesel Crisis

Fuel Shortage: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇంధన కష్టాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ముఖ్యంగా డీజిల్ కొరత వాహనదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. అధికార వర్గాలు తగినన్ని నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల ముందు “నో స్టాక్” బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు గంటల తరబడి బంకుల ముందు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సరఫరా ఎప్పుడు వస్తుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డీలర్లు తెలిపిన వివరాల ప్రకారం, చమురు సంస్థలు సరఫరాలో జాప్యం చేస్తున్న కారణంగానే సమస్య ఏర్పడింది. అవసరమైన స్థాయిలో ట్యాంకర్లు రాకపోవడంతో నిల్వలు త్వరగా ఖాళీ అవుతున్నాయని పేర్కొంటున్నారు. నిల్వలు లేకపోవడంతోనే “నో స్టాక్” బోర్డులు పెట్టాల్సి వస్తోందని పలువురు బంకు యజమానులు వెల్లడించారు. మరోవైపు సమస్యను త్వరగా పరిష్కరించి సాధారణ సరఫరా పునరుద్ధరించాలని వాహనదారులు కోరుతున్నారు.

మరోవైపు, వికారాబాద్ జిల్లా పరిగి కొన్ని పెట్రోల్ బంకుల యజమానులు‌, బంకుల్లో పనిచేసేవాళ్ల ఆగడాలకు అంతులేకుండా పోయింది. పెట్రోల్ డీజిల్ కోసం వచ్చిన వినియోదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొన్ని సమయాలలో పెట్రోల్ అయిపోయిందని పెట్రోల్ బంకుల్లోకి రానివ్వకుండా బోర్డులు పెట్టి తాళ్లు కడుతున్నారు. అదేవిధంగా బంకులో వచ్చే వాహనా దారులతో పెట్రోల్ బంక్ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అర్ధరాత్రి అయ్యాక డీజిల్ వ్యాపారస్తులకు డీజిల్ అమ్ముకుంటున్నారు. నిన్న అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఓ టిప్పర్ లారీలో ఏకంగా 10 డ్రమ్ములు వేసుకొని వచ్చి డీజిల్ తీసుకుపోతుండగా కొందరు వినియోగదారులకు డీజిల్ పోయకపోవడంతో వారు అధికారులు, మీడియాను ఆశ్రయించి దొంగతనంగా డీజిల్ అమ్ముకుంటున్నారని సమాచారం అందించారు. ఇదే తరహా ఘటనలు రాష్ట్రంలోని పలు చోట్ల జరగడం గమనార్హం.