Reading Time: < 1 minute
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం.. గోల్డ్‌, సిల్వర్స్ మెడల్స్‌తో మెరిసిన భార్గవి

విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందిన భార్గవి యూత్ విభాగంలో గోల్డ్ మెడల్, జూనియర్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించి అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటింది. మొత్తం 180 కిలోల బరువును ఎత్తిన ఆమె స్నాచ్‌లో 78 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 102 కిలోలు ఎత్తి ఈ ఘనత సాధించింది. భార్గవి విజయం వెనుక ఆమె కృషి, క్రమశిక్షణతో పాటు కోచ్ వల్లూరి శ్రీనివాసరావు సూచనలు కీలక పాత్ర పోషించాయి. చిన్న గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం ఆమె పట్టుదలకి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందిన భార్గవి నేపథ్యం ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఆమె తల్లిదండ్రులు బెల్లాన శ్రీనివాసరావు, గౌరి దంపతులు సాధారణ వ్యవసాయ కూలీలు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో కూడా వారు కుమార్తెను క్రమశిక్షణతో పెంచి, ఆమె ఆశయాలకు అండగా నిలిచారు. భార్గవి సాధించిన విజయంతో విజయనగరం జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. తమ కుమార్తె ప్రపంచ స్థాయిలో మెరవడంతో ఆమె తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విజయంతో గ్రామ పెద్దలు, జిల్లా, రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు భార్గవిని ఘనంగా అభినందించారు.

ఆమె భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించి దేశానికి కీర్తి తేవాలని ఆశిస్తున్నారు. ఇటీవల భారత వెయిట్ లిఫ్టర్లు ప్రపంచస్థాయిలో మెరుగైన ప్రదర్శనలు చేస్తుండగా, భార్గవి వంటి యువ క్రీడాకారిణిలు భవిష్యత్ ఒలింపిక్స్‌కి ఆశాకిరణాలుగా నిలుస్తున్నారు. సరైన శిక్షణ, మౌలిక వసతులు అందితే భారతదేశం వెయిట్ లిఫ్టింగ్ రంగంలో మరింత ప్రతిష్ఠను సాధించగలదని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.