Reading Time: 2 minutes
IPL 2026 Orange Cap : ఆరెంజ్ క్యాప్ రేసులో కింగ్ కోహ్లీ జంప్.. టాప్-5 బ్యాటర్ల జాబితా ఇదే

IPL 2026 Orange Cap : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంటే.. మరోవైపు బ్యాటర్ల మధ్య ఆరెంజ్ క్యాప్ కోసం పోరు క్లైమాక్స్ రేంజ్‌కు చేరుకుంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన 39వ మ్యాచ్ తర్వాత ఈ జాబితాలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. కింగ్ కోహ్లీ తన పరుగుల వేటను కొనసాగిస్తూ టాప్ 5లోకి దూసుకొచ్చారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కేవలం 15 బంతుల్లోనే 23 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఈ చిన్న ఇన్నింగ్స్‌తోనే ఆయన ఆరెంజ్ క్యాప్ జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నారు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ఆయన వెనక్కి నెట్టేశారు. 8 మ్యాచ్‌లలో 58.50 సగటుతో 351 పరుగులు చేసిన కోహ్లీ, మరోసారి తనేంటో నిరూపించుకున్నారు.

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే ముచ్చటేస్తోంది. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ ఆయన తల పైనే మెరుస్తోంది. ఆడిన 8 మ్యాచ్‌లలో 380 పరుగులు చేసిన అభిషేక్, 212కు పైగా స్ట్రైక్ రేట్‌తో బౌలర్లను వణికిస్తున్నాడు. క్లీన్ హిట్టింగ్‌తో పరుగుల వరద పారిస్తున్న అభిషేక్, ప్రస్తుతం ఈ సీజన్‌లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా నిలిచాడు.

జాబితాలో రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కె.ఎల్ రాహుల్ ఉన్నారు. ఆయన 8 మ్యాచ్‌లలో 358 పరుగులు చేసి అభిషేక్ శర్మకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక మూడో స్థానంలో 15 ఏళ్ల వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీ ఉండటం విశేషం. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న ఈ కుర్రాడు 234 స్ట్రైక్ రేట్‌తో 357 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. చిన్న వయసులోనే ఇంతటి పరిణతితో ఆడటం క్రికెట్ పండితులను సైతం మంత్రముగ్ధులను చేస్తోంది.

టాప్-5 బ్యాటర్ల వివరాలు (మ్యాచ్ 39 తర్వాత):

అభిషేక్ శర్మ (SRH): 8 మ్యాచ్‌లు – 380 పరుగులు.

కె.ఎల్ రాహుల్ (DC): 8 మ్యాచ్‌లు – 358 పరుగులు.

వైభవ్ సూర్యవంశీ (RR): 8 మ్యాచ్‌లు – 357 పరుగులు.

విరాట్ కోహ్లీ (RCB): 8 మ్యాచ్‌లు – 351 పరుగులు.

హెన్రిక్ క్లాసెన్ (SRH): 8 మ్యాచ్‌లు – 349 పరుగులు.

త్వరలో జరగబోయే మ్యాచ్‌లలో ఈ జాబితా మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా క్లాసెన్, కోహ్లీ మధ్య పరుగుల తేడా చాలా తక్కువగా ఉండటంతో వచ్చే మ్యాచ్‌లే నిర్ణయాత్మకం కానున్నాయి.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..