Reading Time: < 1 minute
Actress Mohini Aditya 369 Emotional Interview Husband Black Magic

టాలీవుడ్ క్లాసిక్ ‘ఆదిత్య 369’ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే హీరోయిన్ మోహిని. వందకు పైగా చిత్రాల్లో నటించి, మెగాస్టార్ చిరంజీవి ‘హిట్లర్’ సినిమాలో చెల్లెలి పాత్రతో అలరించిన ఈమె, ఆ తర్వాత వెండితెరకు దూరమయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహిని, తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితంలోని చేదు జ్ఞాపకాలను పంచుకుని అందరినీ షాక్‌కు గురిచేశారు. ఒక తమిళ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు తనతో ప్రవర్తించిన తీరు గురించి మోహిని ఎమోషనల్ అయ్యారు.

‘నాకు ఈత రాదని చెప్పినా వినకుండా, స్విమ్ సూట్ వేయించి బలవంతంగా స్విమ్మింగ్ పూల్ సీన్ చేయించారు. మగవాళ్ల మధ్య ఆ డ్రెస్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఏడుస్తూనే ఆ సీన్ పూర్తి చేశాను. తిరిగి ఊటీలో కూడా అలాంటి సీనే చేయమంటే మొహం మీదే వద్దని చెప్పేశాను’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే జీవితంలో తాను అనుభవించిన అతిపెద్ద కష్టం తన భర్త వల్లనే వచ్చిందని మోహిని పేర్కొన్నారు..

‘నేను బాగుండటం ఇష్టం లేక నా భర్త కుటుంబ సభ్యులే నాపై చేతబడి చేయించారు. ఆ సమయంలో నేను ఎన్నో నరకయాతనలు అనుభవించాను. ఒకానొక దశలో అంతా అయిపోయిందనుకున్నప్పుడు ఆధ్యాత్మికత మార్గంలో ఆ దేవుడే నన్ను కాపాడాడు’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సినిమాలకు దూరమైన మోహిని ఇప్పుడు పూర్తిగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నారు. అమెరికాలో నివసిస్తున్న ఆమె, క్రీస్తు బోధనలను ప్రచారం చేస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నట్లు సమాచారం.