Reading Time: 2 minutes
Chandrababu Says Google Arrival Is Game Changer For Andhra Pradesh

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈరోజు మరిచిపోలేని రోజుగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గూగుల్ రాక కేవలం విశాఖకే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్‌కు గేమ్ ఛేంజర్‌గా మారుతుందని పేర్కొన్నారు.

విశాఖకు గూగుల్.. ఏపీకి కొత్త దశ
30 ఏళ్ల క్రితం సైబరాబాద్‌ను ఐటీ సిటీగా తీర్చిదిద్దితే అది సంపద సృష్టికి కేంద్రంగా మారిందని, ఇప్పుడు విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌తో కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం తెలిపారు. 2026 ఏప్రిల్ 28 తేదీ భారత టెక్నాలజీ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని అన్నారు చంద్రబాబు.. భారత్ తూర్పు తీరంలో రెండు సూర్యులు ఉదయించారని, ఒకటి సహజ సూర్యుడు అయితే మరొకటి టెక్ రంగంలో సూర్యుడిలాంటి గూగుల్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రూ.15 బిలియన్ పెట్టుబడి.. ఆసియాలో అతిపెద్ద డేటా సెంటర్
గూగుల్ రూ.15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏపీ టెక్నాలజీ రంగంలో తలెత్తుకుని నిలబడుతుందని సీఎం చెప్పారు. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌గా ఈ ప్రాజెక్టు నిలుస్తుందని, భారత్‌కు ఏఐ డేటా గేట్‌వేగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతుందని పేర్కొన్నారు. సెర్చ్ ఇంజిన్‌గా ప్రారంభమైన గూగుల్ ఇప్పుడు భారత్ గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందని అన్నారు. ఇప్పటి వరకు ప్రపంచం గూగుల్‌లో వెతికితే, ఇప్పుడు గూగుల్ విశాఖను వెతుక్కుందని వ్యాఖ్యానించారు.

2028 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలి
అదానీ గ్రూప్, ఎయిర్‌టెల్ వంటి దిగ్గజ సంస్థలు ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. 2028 సెప్టెంబర్ నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలని కోరారు సీఎం చంద్రాబు.. ఇక, ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న “స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్”కు గూగుల్ ఏఐ డేటా సెంటర్ సహకారం తీసుకుంటామని సీఎం తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో నలుగురు కార్యదర్శులతో పాటు ఒక కొత్త ఏఐ అసిస్టెంట్ కూడా సుపరిపాలనలో సహకరిస్తోందని వెల్లడించారు.

రైల్వే, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు
రాష్ట్రంలో బుల్లెట్ ట్రైన్ వంటి ప్రాజెక్టులతో పాటు అనేక రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. జూన్ 1 నుంచి సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌కు అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తున్నందుకు కేంద్ర రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

విశాఖకు గోదావరి నీరు.. పోలవరం పూర్తి
60 రోజుల్లో గోదావరి నీటిని విశాఖకు తీసుకువస్తామని, పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం ప్రకటించారు.

యువతకు ఉద్యోగాలు.. ఉత్తరాంధ్రకు కొత్త దశ
గూగుల్ రావడంతో విశాఖ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. గతంలో ఉత్తరాంధ్ర అంటే వలసలు, నిరుద్యోగం గుర్తుకు వచ్చేదని, ఇకపై ఉత్తరాంధ్రకే వలసలు వచ్చే రోజులు మొదలవుతాయని అన్నారు. జూలైలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. 2028 నాటికి ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నుంచి తొలి ఎగుమతి షిప్‌మెంట్ వెలువడుతుందని చెప్పారు. డీప్ టెక్నాలజీ, ఏఐ, క్వాంటం టెక్నాలజీలు భారత భవిష్యత్తును మార్చబోతున్నాయని, ఆ మార్పులో ఏపీ ముందుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.